Superfoods For Women । మహిళలు మీ ఆరోగ్యం జాగ్రత్త.. ఇలాంటి ఆహారం మీకు అవసరం!-international women s day 2023 dear women take care of your health 5 superfoods to add your diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Superfoods For Women । మహిళలు మీ ఆరోగ్యం జాగ్రత్త.. ఇలాంటి ఆహారం మీకు అవసరం!

Superfoods For Women । మహిళలు మీ ఆరోగ్యం జాగ్రత్త.. ఇలాంటి ఆహారం మీకు అవసరం!

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 11:48 AM IST

International Women's Day 2023: ప్రతిరోజూ ఎన్నో రకాల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే మహిళలు, తమ ఆరోగ్యాన్ని చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. మహిళలు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇక్కడ చూడండి.

Superfoods For Women
Superfoods For Women (unsplash)

International Women's Day 2023: ఒక స్త్రీ తన దైనందిన జీవితంలో అనేక రకాల బాధ్యతలను నిర్వర్తిస్తుంది. ఇంటి పనులు చక్కదిద్దడం మొదలుకొని, కుటుంబ సభ్యుల ఆలనాపాలనా చూసుకోవడం వరకు అన్ని పనులను ఎప్పటికప్పుడే పూర్తి చేస్తుంది. ఈరోజు మహిళలు కేవలం ఇంటి పనికి, వంటపనికే పరిమితం కాకుండా తమకు నచ్చిన రంగాలను ఎంచుకొని అందులో రాణిస్తున్నారు. ఇటు వ్యక్తిగత జీవితాన్ని, అటు వృత్తిపరమైన జీవితాన్ని చక్కగా సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇలా ప్రతిరోజూ అన్నింటిని చూసుకోవడం ఎన్నో సవాళ్లతో కూడుకొన్నది, వారు చేసే ఈ రోజూవారీ ప్రయాణం ఎల్లప్పుడూ కఠినమైనదేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి స్త్రీ ఆమె వయస్సుతో పాటు శరీరంలో జరిగే అనేక హార్మోన్ల మార్పులను ఎదుర్కొంటుంది. అందువల్ల, వారు తమను తాము ఆరోగ్యంగా, ఒత్తిడి లేకుండా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

Superfoods For Super Women- మహిళలు తినాల్సిన సూపర్ ఫుడ్స్

మహిళలు తమ ఆరోగ్యం కోసం మంచి పోషకాలతో నిండిన ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి స్త్రీ తన ఆహారంలో చేర్చుకోవలసిన సూపర్ ఫుడ్స్ జాబితా ఇక్కడ చూడండి.

ఆకుపచ్చ కూరగాయలు

కణాల పెరుగుదలకు, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి రోజూ తాజా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. పాలకూర, కాలే, బోక్ చోయ్ వంటివి తీసుకోవాలి. వీటిలో ఫోలేట్ (విటమిన్ బి 9) ఉంటుంది. ఈ పోషకం మహిళ ఆరోగ్యానికి చాలా అవసరం. గర్భధారణ సమయంలోనూ ఫోలెట్ సప్లిమెంట్లను వైద్యులు సిఫారసు చేస్తారు.

అవోకాడోస్

అవోకాడోలలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోర్లు కలిగి ఉండడానికి సహాయపడతాయి. అంతేకాక, మీ కళ్ళకు ప్రయోజనం చేకూర్చే లుటిన్ అవోకాడోస్‌లో కనిపిస్తుంది. ఇంకా అవోకాడోలలో ఒలేయిక్ ఆమ్లం ఉంటుంది, ఇది మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అవోకాడోస్‌లో అధిక పొటాషియం కంటెంట్ రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.

బెర్రీ పండ్లు

ఆంథోసైనిన్స్ , విటమిన్ సి తో సహా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అన్నీ కూడా బెర్రీ పండ్లలో లభిస్తాయి. మహిళలు బెర్రీలను తీసుకోవడం చాలా ముఖ్యం. స్ట్రాబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, వైల్డ్ బ్లూబెర్రీస్ సహా అనేక బెర్రీలు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ బెర్రీలు మీ చర్మాన్ని తాజాగా, ముడతలు లేనివిగా ఉంచుతాయి. ఎక్కువ మంది మహిళలు మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లకు (యుటిఐఎస్) గురవుతారు, క్రాన్బెర్రీలు తినడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా తగ్గించవచ్చు.

డార్క్ చాక్లెట్లు

డార్క్ చాక్లెట్లలో పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. రుతు చక్రంలో దీనిని తినడం చాలా ప్రయోజకరం. డార్క్ చాక్లెట్లలో మెగ్నీషియం ఉంటుంది, ఇది పీరియడ్ తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే, కనీసం 70% స్వచ్ఛమైన కోకోను కలిగి ఉన్న చాక్లెట్ బార్‌ను ఎంచుకోవాలని నిర్ధారించుకోండి. నాణ్యతలేనివి తినడం మంచిది కాదు.

అల్లం

మహిళలకు ప్రతీనెల రుతుచక్రం అనేది ఇబ్బంది పెట్టే ఒక సమస్య. ఈ కారణంగా ప్రతీ నెల వారికి నొప్పి, అసౌకర్యం ఉంటాయి. అయితే అల్లంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది పొత్తికడుపులో నొప్పి, అసౌకర్యం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గడానికి, గ్యాస్ , వికారం తగ్గించడానికి, జీర్ణక్రియకు కూడా అల్లం తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం