Coriander Seeds Health Benefits । ధనియాలతో ఎన్ని ఘనమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Coriander Seeds Health Benefits: ధనియాలు దాదాపు ప్రతి కూరలో ఉపయోగించే ఒక మసాలా దినుసు, ఇది వంటకు రుచి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
స్వీట్స్ మినహా మిగతా అన్ని రకాల ఆహార పదార్థాలలో మనం కొత్తిమీరను విరివిగా వినియోగిస్తాం. కొత్తిమీరను కేవలం ఆకుల రూపంలోనే కాకుండా వాటి విత్తనాలను, అలాగే ఆ విత్తనాలతో చేసి ధనియాల పొడిని దాదాపు ప్రతికూరలో వేసుకుంటాం. ధనియాలు వంటకాలకు మంచి ఫ్లేవర్, రుచిని అందించడమే కాకుండా ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి అని ఆయుర్వేదం చెబుతుంది.
Coriander Seeds Health Benefits- ధనియాలు- కొత్తిమీరతో ఆరోగ్య ప్రయోజనాలు
మిమ్మల్ని మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం కొత్తిమీర, ధనియాలను ఏ రూపంలోనైనా మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ధనియాలతో కలిగే కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఇక్కడ చూడండి.
పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
ధనియాలలోని ఔషధ గుణాలు జీర్ణక్రియను పెంచుతుంది. ఉబ్బరం, అసౌకర్యం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకలిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. పేగు వ్యాధి (IBS) సమస్య ఉన్న వారు తమ ఆహారంలో కొత్తిమీర చేర్చుకోవడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోగనిరోధక శక్తి కోసం
ధనియాలలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులోని వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక కణాలు కూడా అభివృద్ధి చెందకుండా నిరోధిస్తాయి. వివిధ అనారోగ్యస సమస్యల నుంచి రక్షించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలు కలిగి ఉన్నాయి.
రక్తంలో చక్కెర నియంత్రణ
ధనియాలలో ఉండే వివిధ సమ్మేళనాలు, నూనెలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. మీకు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించుకోవాలనుకుంటే ధనియాలను ఆహారంగా తీసుకోండి. వీటిలోని సమ్మేళనాలు ఎంజైమ్‌లను యాక్టివేట్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి. అయితే డయాబెటిస్ చికిత్స పొందుతున్నవారు వైద్యుల సలహా మేరకే వీటిని తీసుకోవడం ఉత్తమం.
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఆందోళనను తగ్గించి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడు వాపు వంటి సమస్యలను దూరం చేస్తుంది. కొత్తిమీరలోని సారం దాదాపు డయాజెపామ్ వలె ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. డయాజెపామ్ అనేది ఆందోళన, మూర్ఛలు, ఆల్కహాల్ ఉపసంహరణ సిండ్రోమ్, కండరాల నొప్పులు, నిద్రలేమి మొదలైన వాటికి ఉపయోగించే ఒక ఔషధం.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
ఈరోజుల్లో చాలా మంది గుండె జబ్బులతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఎల్లప్పుడూ చర్యలు తీసుకోవాలి. కొత్తిమీరలోని సమ్మేళనాలు సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) లేదా చెడు కొలెస్ట్రాల్ తగ్గించడం, రక్తపోటును నియంత్రించడం అలాగే HDL లేదా మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మీ వైద్యుల సలహాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
సంబంధిత కథనం