Deal With Exam Stress । పరీక్షలకు బాగా సిద్ధంకండి, ఒత్తిడిని జయించేందుకు మార్గాలు ఇవిగో!
How To Deal With Exam Stress: పరీక్షలు దగ్గరపడుతున్నకొదీ విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళనలు పెరగటం సాధారణం. ఒత్తిడిని జయించి, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు చిట్కాలు చూడండి.
పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థుల్లో తెలియని ఒక ఆందోళన మొదలవుతుంటుంది. ఏడాదంతా ఎంత బాగా చదువుకున్నా, మొదటి నుండి సరిగ్గా ప్రిపేర్ అయినప్పటికీ కూడా పరీక్షలు ఒత్తిడిని కలిగిస్తాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వైపు నుంచి కూడా విద్యార్థులపై ఉండే అంచనాలు వారి ఒత్తిడి స్థాయిలను మరింత పెంచుతాయి. ఈ ఒత్తిడిలో నేర్చుకున్నదంతా మర్చిపోతారు, ఇది విద్యార్థులను నిరాశ, నిస్పృహలకు గురిచేస్తుంది. పరీక్షల వేళ ఇలాంటి ఒత్తిడి, ఆందోళనలు ఉండటం సర్వసాధారణం. అయితే పరీక్షల ఒత్తిడి నుంచి బయటపడేందుకు మార్గాలు ఉన్నాయి.
పరీక్షలు రాయబోయే విద్యార్థులు, అభ్యర్థులు తాము ఇంతకాలం చదివింది సమర్థవంతంగా పునరాభ్యాసం చేసుకునేందుకు, ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్‌ని మెరుగుపరుకొనేందుకు కొన్ని వ్యూహాలను అనుసరించాలి.
Tricks To Deal With Exam Stress- పరీక్షల ఒత్తిడిని జయించే మార్గాలు
ఈ వ్యూహాలు విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి, వారిని పరీక్షల కోసం సర్వసన్నద్ధం చేయగలవు. మరి అందుకోసం మీరు అనుసరించగల కొన్ని ప్రభావవంతమైన వ్యూహాలను ఇక్కడ తెలుసుకోండి.
1. ఇతరులతో పోల్చుకోవడం వద్దు
ఎవరు ఎంత చదివారు, ఎవరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు అన్నది ముఖ్యం కాదు. పరీక్షల్లో ఎవరు బాగా రాశారన్నదే ఇక్కడ కీలకం. కాబట్టి వేరొకరు తమకంటే బాగా చదువుతున్నారు, మీ సమయం వృధా అవుతుంది అనేది మనసులో నుంచి తీసేయండి. వేరొకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు, ఇది పరీక్షల వేళ మరింత ఒత్తిడికి గురి చేస్తుంది. మీ శక్తి సామర్థ్యాలేమిటో మీకు తెలుసు, ఎవరి పఠనాశక్తి వారిదే. కాబట్టి మీరు మీ చదువుపై దృష్టి కేంద్రీకరించండి.
2. చదువుకునే నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి
పరీక్షలకు సమయం దగ్గరకొస్తున్నాకొద్దీ మీ లెర్నింగ్ టెక్నిక్‌లను మెరుగుపరుచుకోవడం ముఖ్యం. మీ రివిజన్ ను మరింత ఆకర్షణీయంగా చేయండి. గమనికలు, ఫ్లాష్‌కార్డ్‌లు, రేఖాచిత్రాలు, విజువల్స్‌ను సిద్ధం చేయండి. మీ చదువులో కొంత ఆహ్లాదాన్ని చేర్చేందుకు మీ స్నేహితులతో క్విజ్‌లను రూపొందించండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, మీ ప్రిపరేషన్ సమయాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది. ఈ రకమైన వ్యూహాలతో మీరు క్లిష్టమైన అంశాలను సులభంగా నేర్చుకోగలుగుతారు, చదువుపై మీ ఆసక్తి మరింత పెరుగుతుంది. మీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
3. విరామాలు తీసుకోండి
ఏకధాటిగా చదువుతున్నప్పుడు మధ్యమధ్యలో విరామాలు తీసుకోండి. కొద్దిసేపు అటూ ఇటూ నడవండి. చిన్న విరామాలు తీసుకోవడం ద్వారా మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఉదయం లేదా సాయంత్రం నడకకు వెళ్తే, అది మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. పార్క్, ప్లేగ్రౌండ్ లేదా మార్కెట్‌కి మీ కుటుంబం లేదా స్నేహితులతో 10 లేదా 20 నిమిషాల పాటు బయటకు వెళ్లిరావడం అనేది ఒత్తిడిని తగ్గించడానికి ఒక అద్భుతమైన మార్గం.
4. సమతుల్య ఆహారాన్ని తీసుకోండి
మీరు చదివేటపుడు, చదివింది ఎక్కాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. సమతుల్య ఆహారం తినడం, నీరు సమృద్ధిగా తాగి హైడ్రేటెడ్ గా ఉండటం ద్వారా మీ శారీరక, మానసిక బలాన్ని కాపాడుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, కాయధాన్యాలు, గింజల నుండి మీ శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. విటమిన్ సి లభించే సిట్రస్ పండ్లు తినడం ద్వారా రక్తపోటును తగ్గించడానికి, ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లను నియంత్రించడానికి తోడ్పడుతుంది.
5. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
మీరోజులో ఒక అరగంట వ్యాయామం చేయటానికి కేటాయించండి. ఏ రకమైన వ్యాయామం అయినా శరీరం, మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. పరుగు, నడక, యోగా, స్విమ్మింగ్ లేదా ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు చేయడం ద్వారా చదువులో నిమగ్నమవ్వడానికి శక్తినిస్తాయి. వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి, ఏకాగ్రతను పెంచుతాయి.
6. తగినంత నిద్ర పొందండి
పగలు, రాత్రి తేడా లేకుండా చదవడం మంచిది కాదు. అతిగా చదవడం, అతిగా మెదడుకు శ్రమ కల్పించడం ద్వారా శరీరం అలసిపోతుంది. ఇది నిద్రలేమికి కారణమయి, మరింత ఒత్తిడికి దారితీస్తుంది. అందువల్ల తగినంత నిద్రపొందడం అవసరం. చదువుకు ఒక నిర్ధిష్ట షెడ్యూల్ కేటాయించండి, మంచి రాత్రి నిద్ర ఉండేలా చూసుకోండి.
సంబంధిత కథనం