Walking vs Running । నడక మంచిదా, పరుగు మంచిదా? ఏది ఎంచుకోవాలో తెలుసుకోండి!
Walking vs Running: రన్నింగ్ చేయడం ద్వారా లభించే అన్ని ప్రయోజనాలు నడకతోనూ లభిస్తాయి. మారి ఈ రెండింటిలో ఏది ఎంచుకోవడం ఉత్తమం? ఇక్కడ తెలుసుకోండి,
ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం, మంచి నిద్ర అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. అయితే వయసు ప్రభావం, బద్ధకం ఇతరత్రా కారణాలతో జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారు నడక లేదా పరుగును వ్యాయామంగా ఎంచుకుంటారు. నడక లేదా రన్నింగ్ ఈ రెండూ వ్యాయామం లాంటివే, మరి ఇందులో ఏది ఉత్తమం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రెండూ కూడా వేటికవే వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలనుకునే వారికి, ఫిట్‌గా ఉండటం కోసం మీరు నడక లేదా పరుగును ఏదో ఒక యాక్టివిటీని ఎంచుకోవచ్చు. నడకతో అలాగే పరుగుతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుంటే మీరు ఇందులో ఒకటి ఎంచుకోవడం సులువవుతుంది. ఇక్కడ వీటి ప్రయోజనాలకు సంబంధించిన కొన్ని విషయాలు తెలియజేస్తున్నాం. ఆ ప్రకారంగా మీ రోజూవారీ వ్యాయామ దినచర్యను కొనసాగించవచ్చు.
నడక, పరుగు రెండూ ఏరోబిక్ అంటే 'ఆక్సిజన్ సామర్థ్యాన్ని ఉపయోగించే వ్యాయామాలు'. ఇవి రక్తంలో గ్లూకోజ్ లేదా శరీర కొవ్వుతో ఆక్సిజన్‌ను కలపడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేసే శారీరక శ్రమ. ఈ రెండూ కార్డియో వ్యాస్కులర్ వ్యాయామాలు, ఇవి మీ హృదయనాళ వ్యవస్థకు మంచివి. మీ కండరాలను బలోపేతం చేయడానికి, మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మీ రోగనిరోధక శక్తి కూడా బలోపేతం అవుతుంది.
Walking & Running Difference- రెండింటి మధ్య వ్యత్యాసం ఇదే
రన్నింగ్, వాకింగ్ మధ్య వ్యత్యాసం తీవ్రత. రన్నింగ్ వేగంగా ఉంటుంది, ఎక్కువ కిలోజౌల్‌లను ఉపయోగిస్తుంది. నడక కంటే గుండె, ఊపిరితిత్తులు, కండరాల నుండి ఎక్కువ పనితీరును కోరుతుంది. నడక కంటే రన్నింగ్‌కు పూర్తి స్థాయి ఫిట్‌నెస్ అవసరం.
Walking vs Running - బరువు తగ్గడానికి ఏది మంచిది
నడక, పరుగు రెండూ కూడా దాదాపు ఒకే విధమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయి. బరువు తగ్గడం మీ ఏకైక లక్ష్యం అయితే, రన్నింగ్ ఉత్తమ ఎంపిక, ఎందుకంటే ఇదిఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో మీకు సహాయపడుతుంది. నడక కేలరీలను బర్న్ చేయడంలో కూడా మీకు సహాయపడుతుంది, కానీ అది పరుగు కంటే తక్కువగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యకరమైన బరువును కొనసాగించాలనుకుంటే, ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం మీకు సరిపోతుంది. అయితే, వేగాన్ని పెంచడం ద్వారా మీరు బర్న్ చేసే కేలరీల సంఖ్యను పెంచుకోవచ్చు.
ఉదాహరణకు 70 కిలోల బరువు ఉన్న వ్యక్తి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తడం వలన సుమారు 606 కేలరీలు ఖర్చవుతాయి. అదే సమయంలో నడవడం వల్ల కేవలం 314 కేలరీలు ఖర్చవుతాయి. మీరు ఒక కేజీ తగ్గాలనుకుంటే సుమారు 7700 కేలరీలను బర్న్ చేయాల్సి ఉంటుంది.
ఏది ఎంచుకోవాలి
మీరు ఇప్పుడిప్పుడే వ్యాయామం చేయడం ప్రారంభించినట్లయితే లేదా పరుగెత్తలేకపోతే, నడకను ఎంచుకోవడం ఉత్తమం. దాదాపు అన్ని ఫిట్‌నెస్ స్థాయిలకు నడక ఆదర్శవంతమైన వ్యాయామం. మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని నడకతో ప్రారంభించండి. మీరు రెగ్యులర్ అయిన తర్వాత, ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి మీ వేగాన్ని పెంచండి. ఒకటి లేదా రెండు వారాల తర్వాత, మీరు పరుగును ప్రారంభించవచ్చు. మీరు 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే, ఏవైనా గుండె సమస్యలు లేదా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతుంటే, మీరు నడకను ఎంచుకోవడం ఉత్తమం.
సంబంధిత కథనం