Weight Loss: ఒక నెలలో మనం ఎంత బరువు తగ్గొచ్చు? పరిమితికి మించి తగ్గితే ఏమవుతుంది?-here is how much weight you can safely lose in a month ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss: ఒక నెలలో మనం ఎంత బరువు తగ్గొచ్చు? పరిమితికి మించి తగ్గితే ఏమవుతుంది?

Weight Loss: ఒక నెలలో మనం ఎంత బరువు తగ్గొచ్చు? పరిమితికి మించి తగ్గితే ఏమవుతుంది?

Galeti Rajendra HT Telugu
Aug 22, 2024 12:44 PM IST

ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో శరీర బరువుని అదుపులో ఉంచుకోవడం పెద్ద ఛాలెంజ్. శరీర బరువు అదుపులో లేకపోతే తరచూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

బరువు తగ్గడం
బరువు తగ్గడం

Tips for safe weight loss: శరీర బరువుని అదుపులో ఉంచుకోవడం ఇప్పుడు చాలా మందికి పెద్ద సవాలుగా మారిపోయింది. మారిన ఆహారపు అలవాట్లతో కొంత మంది బరువు పెరుగుతుండగా, పని ఒత్తిడితో రోజువారీ వ్యాయామానికి దూరమై మరి కొందరు శరీర బరువుని అదుపులో ఉంచుకోలేకపోతున్నారు. దాంతో అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఒక్కసారిగా బరువు తగ్గాలనే ఉబలాటంతో శరీరాన్ని కష్టపెట్టి మరింతగా చిక్కుల్లో పడుతున్నారు.

నెలలో ఎంత బరువు తగ్గొచ్చు?

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఒక మనిషి శారీరక శ్రమ ద్వారా వారానికి 0.5 నుంచి 1 కిలో మాత్రమే తగ్గాలి. ఓవరాల్‌గా నెలకి 4 కిలోల మించి బరువు తగ్గకూడదు. ఇలా క్రమశిక్షణతో బరువు తగ్గితే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు.

5 కిలోలకి మించి బరువు తగ్గితే?

ఒకే నెలలో ఎక్కువ బరువు తగ్గడానికి అనాలోచితంగా శరీరాన్ని కష్టపెట్టకూడదు. అలా చేస్తే బరువు తగ్గడం మాట అటుంచితే కొత్త ఇబ్బందులు వస్తాయి. డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇమ్‌బ్యాలెన్స్, పిత్తాశయ రాళ్లు, పోషకాహారలోపానికి గురై అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంది.

రోజుకి 1000 కేలరీలు టార్గెట్

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం బరువు తగ్గాలని ఆశించే వారు రోజుకి 500 నుంచి 1,000 కేలరీలను వ్యాయామం ద్వారా బర్న్ చేయాలి. అలా కాకుండా మహిళలు రోజుకు 1,200, పురుషులు రోజుకు 1,500 కేలరీలకి మించి బర్న్ చేస్తే పోషకాహారలోపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బరువు తగ్గే క్రమంలో రోజువారీగా కేలరీలను బర్న్ చేయడమే కాదు.. పోషకాలు కూడా సమపాళ్లలో తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణ ధాన్యాలు ఆహారంలో చేర్చాలి.

స్లో అండ్ స్టడీ ఎందుకంటే?

శరీరం మార్పులకి అనుగుణంగా సిద్ధమవ్వాలంటే స్లో అండ్ స్టడీనే కరెక్ట్. నెమ్మదిగా బరువు తగ్గితే దానికి అనుగుణంగా శరీరం నుంచి కూడా మద్దతు లభిస్తుంది. అలా కాకుండా బరువు తగ్గడానికి ఒక్కసారిగా కష్టపెట్టడం లేదా తిండి తగ్గించడం లాంటివి చేస్తే శరీరం కూడా ఆ మార్పునకి అనుమతించదు. బరువు తగ్గడానికి సురక్షితమైన మార్గాన్ని ఎంచుకోవడంతో పాటు దాన్ని అర్థం చేసుకుని క్రమశిక్షణతో మళ్లీ బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి.