IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీలో బాహుబలి.. క్వింటాల్ బరువు మోసే సత్తా
IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్.. ఎన్నో ఆవిష్కరణలకు వేదిక. ఇక్కడి విద్యార్థులు చేసిన ప్రయోగాలు అద్బుతాలు. గతంలో ఎన్నో కీలక ప్రాజెక్టులను చేపట్టిన ఐఐటీ హైదరాబాద్‌లోని పరిశోధకులు.. తాజాగా మరో భారీ ప్రాజెక్టును తుది దశకు తీసుకొచ్చారు.
మన దేశంలో ఎన్నో సందర్భాల్లో ఊహించని విపత్తులు సంభవించాయి. ఆ సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరుగుతోంది. అదే సమయంలో ఎంతో మంది నీరు, తిండి దొరక్క అల్లాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో హెలీకాప్టర్లు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ప్రభుత్వాలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో.. ఐఐటీ హైదరాబాద్‌లో ఓ మంచి ప్రాజెక్ట్ చేపట్టారు. ప్రస్తుతం ఇది తుది దశకు చేరుకుంది.
టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టీహాన్) ఆధ్వర్యంలో.. 100 కిలోల బరువును కూడా అవలీలగా మోసుకెళ్లే డ్రోన్ తయారీ ప్రాజెక్టును చేపట్టారు. ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉంది. అతి త్వరలోనే ఈ భారీ బాహుబలి డ్రోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 60 కిలోల బరువు తీసుకువెళ్లే డ్రోన్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. అదే స్పూర్తితో 100 కిలోల బరువును మోసుకెళ్లే భారీ డ్రోన్‌ను తయారుచేయబోతున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తయితే.. ఆపద సమయాల్లో ఎంతో ఉపయోగపడనుంది. ముఖ్యంగా వరదలు, విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యల్లో దీన్ని వినియోగించవచ్చు. దీని ద్వారా ఆహార పధార్థాలు, ఇతర అత్యవసర వస్తువులు సరఫరా చేయవచ్చు. కీలక ఆపరేషన్లలోనూ ఈ బాహుబలి డ్రోన్‌ను వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సైన్యానికి కూడా ఈ భారీ డ్రోన్‌లు ఉపయోగపడే అవకాశం ఉంది.