World Ocean Day 2022 : కడలిని కంటిపాపలా కాపాడుకోవాలి.. లేదంటే విపత్తులు తప్పవు
ప్రపంచ మహాసముద్రం, వనరుల స్థిరత్వాన్ని ప్రోత్సాహించడానికి ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీన ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిలో భాగంగా సముద్రం, దాని వనరుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రత్యేక థీమ్‌ను ఎంచుకుంటారు. మీకు ఈ రోజు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి.
World Ocean Day 2022 | ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 8వ తేదీన నిర్వహిస్తారు. మన దైనందిన జీవితంలో మహాసముద్రాల పాత్ర, ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈరోజు సహాయపడుతుంది. ఐక్యరాజ్యసమితి ప్రకారం.. మహాసముద్రాలపై మానవ కార్యకలాపాల ప్రభావం గురించి అవగాహన పెంచడానికి, సముద్ర జాతుల కోసం ఐక్య ఉద్యమాన్ని రూపొందించడానికి ఈ రోజును ఉద్దేశించారు. మహాసముద్రాలు కేవలం నీటి వనరులే కాదనీ.. అవి మనకు జీవనాధారమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మర్చిపోకూడదు.
బీచ్‌ల వంటి నీటి వనరుల చుట్టూ.. మన అజాగ్రత్త వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో సముద్రంలోని అనేక వేల జీవరాశులు మరణిస్తున్నాయి. కొన్ని కలుషితమైపోతున్నాయి. వీటన్నింటి వల్ల ప్రకృతి విపత్తులు జరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించి.. సముద్రాల సుస్థిర అభివృద్ధికి కృషి చేసేలా.. వారికి అవగాహన కల్పిస్తారు.
ఈ సంవత్సరం థీమ్..
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం '' మహాసముద్రాల పునరుజ్జీవనం"ను థీమ్‌గా ఎంచుకున్నారు. ఈ థీమ్ ప్రకారం సముద్రం మాతృ స్వభావాన్ని రక్షించడానికి, సంరక్షించడానికి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులలో అవగాహన పెంచడానికి ఇది సహాయపడుతుంది.
ప్రాముఖ్యత
సముద్రం కనీసం 50% ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని ఐక్యరాజ్యసమితి డేటా సూచిస్తుంది. మహాసముద్రాలు 30% కంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయని.. ఇవి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గిస్తాయని రుజువు చేసింది. చెత్త, మురుగు, చమురు లీకేజీల వంటి మానవ కార్యకలాపాల చర్యల వల్ల.. విధ్వంసం జరిగే అవకాశముంది. ఈ విషయాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి.
చరిత్ర
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని 1992లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్‌లో UN మొదటిసారిగా ప్రతిపాదించింది. మహాసముద్రాలు మన జీవితాలలో కీలక పాత్ర పోషిస్తాయని.. వాటిని రక్షించడంలో ప్రజలకు సహాయపడే మార్గాల గురించి అవగాహన పెంచడానికి ఓ రోజును పాటించాలని సూచించారు.
ఈ ఈవెంట్‌ను హైబ్రిడ్ వేడుకగా నిర్వహించడం ఇదే మొదటిసారి. ప్రత్యక్ష ప్రసారం చేయడానికి న్యూయార్క్‌లోని UN ప్రధాన కార్యాలయంలో ఇది వ్యక్తిగతంగా హోస్ట్ చేస్తున్నారు.
సంబంధిత కథనం