Tomato Upma Breakfast | మరింత టేస్టీగా, మరింత ట్యాంగీగా.. చేసుకోండిలా టమోటా ఉప్మా!
Tomato Upma Recipe: రోజూ ఒకేరకమైన ఉప్మా తినలేకపోతున్నారా? మరింత టేస్టీగా, మరింత ట్యాంగీగా ఇలా టమోటా ఉప్మా చేసుకోండి, రెసిపీ చూడండి.
మనకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి వెతికే ఆప్షన్లలో ఉప్మా ఒకటి. త్వరగా చేసుకోగలిగే ఏదైనా వంటకం ఉందా అంటే అది ఉప్మానే. ఇది ఎంతో తేలికైన, ఆరోగ్యకరమైన అల్పాహారం. దీనిలో కేలరీలు తక్కువ ఉంటాయి, పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఇది మీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది, కాబట్టి ఆకలి వేయదు, బరువు నియంత్రణకు ఇది మంచి ఆహారం. ఈ రుచికరమైన వంటకాన్ని బ్రేక్‌ఫాస్ట్, బ్రంచ్ లేదా రాత్రికి అల్పాహారంగా తినవచ్చు లేదా భోజనంగా కూడా చేయవచ్చు.
ఉప్మాను ఎప్పుడూ చేసేలా కాకుండా టొమాటోలు కలిపి కూడా చేసుకోవచ్చు. ఇది కొద్దిగా ట్యాంగీ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. రుచికూడా మరింత పెరుగుతుంది. టొమాటో ఉప్మా రెసిపీ ఈ కింద ఉంది. ఇక్కడ అందించిన సూచనలను అనుసరించి మీరు కూడా మంచి టొమాటో ఉప్మాను సిద్ధం చేసుకోవచ్చు.
Tomato Upma Recipe కోసం కావలసినవి
- 1 కప్పు గోధుమ రవ్వ
- 2 టేబుల్ స్పూన్లు కూరగాయల నూనె
- 3/4 టీస్పూన్ ఆవాలు
- 5 నుండి 6 కరివేపాకు ఆకులు
- 2 పచ్చి మిరపకాయలు
- 1 అంగుళం అల్లం ముక్క
- 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు
- 2 మీడియం సైజ్ టమోటాలు
- 2 కప్పుల వేడి నీరు
- 1 చిటికెడు పసుపు
- ఉప్పు రుచికి తగినంత
- 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం
- 1/4 కప్పు తరిగిన తాజా కొత్తిమీర
టమోటా ఉప్మా తయారీ విధానం
- ముందుగా మీడియం వేడి మీద పాన్ వేడి చేసి, రవ్వను దోరగా వేయించండి, అనంతరం తీసి పక్కనపెట్టండి.
- ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- అనంతరం తురిమిన అల్లం వేసి వేయించాలి, ఆపై చిన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి.
- ఇప్పుడు టమోటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు ఉడికించాలి.
- ఆపైన వేడినీరు, పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
- ఇప్పుడు దోరగా వేయించిన రవ్వను వేసి ఉడికించండి, ముద్దలు ఏర్పడకుండా తరచుగా కలుపుతూ ఉండండి.
- ఉప్మా దగ్గరకు, చిక్కటి గంజిలా వచ్చేవరకు ఉడకబెట్టండి. అనంతరం స్టవ్ ఆఫ్ చేయండి.
అంతే, టమోటా ఉప్మా రెడీ. దాని మీద కొద్దిగా నిమ్మరసం పిండుకోండి, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా వడ్డించుకోండి.
సంబంధిత కథనం