Pomegranate Poha Recipe । బ్రేక్‌ఫాస్ట్‌గా దానిమ్మ పోహా.. ఇలా తింటే మీ గుండె ఉంటుంది ఆరోగ్యంగా!
Pomegranate Poha Recipe: రోజుకి 3 దానిమ్మలు తింటే గుండెకు మంచిది. దానిమ్మ గింజలను పోహాలో కలుపుకొని బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే ఎలా ఉంటుంది. రెసిపీ ఇక్కడ ఉంది, చేసుకొని తిని చూడండి.
పోహా అనేది భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన అల్పాహారం. దీనినే మనం అటుకులు అంటాం, మెత్తగా చేసుకున్నప్పుడు అల్పాహారంగా తీసుకుంటాం. ఇలా మెత్తగా చేసుకున్న పోహా ఎంతో రుచిరంగా ఉంటుంది. దీనిని ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్‌గా, టీ టైమ్‌లో స్నాక్స్‌గా, ఉపవాసం ఉన్నప్పుడు డిన్నర్ సమయంలో ఉపాహారంగా తీసుకుంటారు. ఇది ఎంతో తేలికపాటి అల్పాహారం కాబట్టి సులభంగా జీర్ణం అవుతుంది, ఆరోగ్యానికి మంచిది. అయితే ఎప్పుడు చేసుకున్నట్లుగా కాకుండా ఇండోరి పోహా రెసిపీని అందిస్తున్నాం.
ఇండోరి పోహా అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఇండోరి పోహాలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేమిటంటే ఈ వంటకంలో అటుకులతో పాటు, అదనంగా సోంపు గింజలు, దానిమ్మ గింజలను చల్లుతారు. దీనివల్ల ఇది మరింత ఆరోగ్యకరంగా, పోషకభరితంగా ఉంటుంది. ఇలా దానిమ్మ గింజలను చల్లుకోవడం చాలా మంచిది.
ఆయుర్వేదం ప్రకారం రోజుకి 3 దానిమ్మలు తినాలి. దీనివల్ల ధమనులు శుభ్రపడతాయి. గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి గుండెజబ్బులను నివారించవచ్చు. దానిమ్మ గింజలు నిండిన పోహా ఎలా చేయాలో ఈ కింద సూచనలను చదవండి.
Pomegranate Poha Recipe కోసం కావలసినవి
- 1 కప్పు మందపాటి అటుకులు
- 1 కప్పు దానిమ్మ గింజలు
- 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ
- 1 సన్నగా తరిగిన క్యాప్సికం
- 1 సన్నగా తరిగిన పచ్చిమిర్చి
- 1/2 టీస్పూన్ ఆవాలు
- 1 టేబుల్ స్పూన్ ఫెన్నెల్ విత్తనాలు
- 1/4 టీస్పూన్ పసుపు పొడి
- 1/4 టీస్పూన్ తురిమిన అల్లం
- 1 టేబుల్ స్పూన్ పచ్చి వేరుశనగ
- 1 టేబుల్ స్పూన్ నూనె
- 1 నిమ్మరసం
- ఉప్పు రుచికి తగినంత
- కొత్తిమీర తగినంత
దానిమ్మ పోహా తయారీ విధానం
- ముందుగా అటుకులను 3 సార్లు కడిగి, ఆపై నీటిని పూర్తిగా తీసివేసి పక్కన పెట్టండి. ఇందులో చిటికెడు చక్కెర, ఉప్పు వేసి కలిపితే నానబెట్టిన అటుకులు విరగకుండా ఉంటాయి.
- ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి, ఆవాలు వేసి, అవి చిటపటలాడటం ప్రారంభించిన తర్వాత వేరుశెనగలను వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
- ఆ తర్వాత ఉల్లిపాయలు ముక్కలు వేసి వేయించాలి, ఆపై పచ్చిమిర్చి, క్యాప్సికం ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
- తర్వాత సోపు గింజలు, తురిమిన అల్లం, పసుపు పొడి వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి.
- ఇప్పుడు నానబెట్టిన అటుకులు వేసి అన్నీ బాగా కలపాలి. కడాయిని ఒక మూతతో కప్పి, తక్కువ వేడి మీద 5 నిమిషాలు ఉడికించాలి.
- 5 నిమిషాల తర్వాత వేడిని ఆపివేసి, తరిగిన కొత్తిమీర, దానిమ్మలతో గార్నిష్ చేసి, కొద్దిగా నిమ్మరసం పిండాలి.
అంతే, దానిమ్మ పోహా రెడీ. ఆహా అనుకుంటూ తినండి, ఒక కప్పు మసాలా చాయ్‌తో మీ అల్పాహారం ముగించండి.