Mouth Breathing । నోరు తెరిచి నిద్రపోతున్నారా.. కారణాలు ఇవే!
Mouth Breathing: నోరు తెరిచి నిద్రపోతున్నారా? స్లీప్ అప్నియా కావచ్చు, లేక మరికొన్ని కారణాలు ఉండవచ్చు, తెలుసుకోండి.
కొందరికి నోరు తెరిచి నిద్రపోయే (Sleeping With Mouth Open) అలవాటు ఉంటుంది, అలాగే వారికి నిద్రపోతున్నప్పుడు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది ఉండవచ్చు. అవసరానికి తగ్గట్టుగా ఆక్సిజన్ పొందడం కోసం ఇలా నోరు తెరిచి నిద్రించడం అలవాటుగా మారవచ్చు. ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య. ఇలాంటి పరిస్థితిని స్లీప్ అప్నియాగా పేర్కొనవచ్చు, నిద్రలో శ్వాస అకస్మాత్తుగా ఆగిపోయే పరిస్థితి ఇది. అయితే అందరిదీ అదే సమస్య అని చెప్పలేం. స్లీప్ అప్నియా సమస్య లేకపోయినా, నోటి ద్వారా శ్వాస తీసుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. శ్వాస నాళాల్లో అడ్డంకులు లేదా రద్దీ కారణంగా తరచుగా ఈ పరిస్థితి ఉంటుంది.
ముక్కు లోపల రక్త నాళాలు రక్తంతో నిండిపోయినపుడు వాపు, సంకోచానికి కారణమవుతుంది. ఇది ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది, దీంతో వ్యక్తులు సులభంగా ఊపిరి పీల్చుకోవడానికి నోరు తెరుస్తాడు.
Mouth Breathing Causes- నోరు తెరిచి శ్వాస తీసుకోవడానికి గల కారణాలు
పైన పేర్కొన్నవి కాకుండా, వ్యక్తులు నోరు తెరిచి నిద్రించడానికి గల మరికొన్ని కారణాలు ఇక్కడ తెలుసుకోండి.
ఒత్తిడి, ఆందోళన
విపరీతమైన ఒత్తిడి, ఆందోళనకు గురికావడం వలన శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారు రోజంతా నోటి ద్వారా శ్వాస పీల్చుకునే అవకాశం ఉంది. వాస్తవానికి, ఒక వ్యక్తి ఆందోళన చెందుతున్నప్పుడు, శ్వాస వేగం కూడా పెరుగుతుంది, రక్తపోటు ఎక్కువవుతుంది. ఈ సందర్భంలో వారు తమ నోరు తెరిచి వేగంగా ఊపిరి పీల్చుకుంటారు.
ఆస్తమా
ఊపిరితిత్తులలో వాపు వల్ల ఆస్తమా వస్తుంది. ఇది ఉన్నప్పుడు తరచుగా శ్వాస ఆడకపోవడం, గురకకు కారణమవుతుంది. ఆస్తమా నయం కావడానికి చాలా సమయం పడుతుంది. శ్వాస నాళాల్లో రద్దీ చాలా నెమ్మదిగా తగ్గుతుంది కాబట్టి శరీరం నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి అలవాటుపడుతుంది.
అలర్జీలు
నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి అలెర్జీలు మరొక సాధారణ కారణం. శరీరంలోకి ఏదైనా విదేశీ కణం ప్రవేశించినపుడు రోగనిరోధక వ్యవస్థ వెంటనే అప్రమత్తమై దానిపై దాడి చేస్తుంది, ఈ సందర్భంలో అలెర్జీ సంభవిస్తుంది. అటువంటి పరిస్థితిలో వ్యక్తులు వేగంగా ఊపిరి పీల్చుకుంటారు, అలెర్జీని తొలగించే ప్రయత్నంలో నోటి ద్వారా ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం కలుగుతుంది.
జలుబు, దగ్గు
నాసికా రద్దీతో కూడిన జలుబు సమయంలో, తగినంత ఆక్సిజన్‌ను పొందడానికి శరీరం పూర్తిగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటుంది. అంతే కాకుండా జలుబుతో సైనస్ లాంటి జబ్బు వచ్చినా నోటితోనే ఊపిరి పీల్చుకుంటారు.
స్లీప్ అప్నియా
స్లీప్ అప్నియా అనేది ఒక వైద్య పరిస్థితి, దీ సమస్యతో బాధపడేవారు రాత్రిపూట నోటి ద్వారా ఊపిరి పీల్చుకుంటారు. నిద్రలో శరీరంలోని ఎగువ వాయుమార్గం పదేపదే నిరోధించినప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఏర్పడుతుంది. ఇది గాలి ప్రవాహాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా అడ్డుకుంటుంది. శరీరానికి శ్వాస అవసరమనే సంకేతాలను కూడా మెదడును స్వీకరించకుండా నిరోధిస్తుంది.
మీరు నోరు తెరిచి నిద్రపోయే వారైతే మీ పరిస్థితికి ఇందులో ఏదో ఒక కారణం అయి ఉంటుంది. నోరు మూసుకొని పడుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇవి ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. సమస్య కొనసాగితే వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం.
సంబంధిత కథనం