World Asthma Day 2022 | ఆస్తమా గురించిన అపోహలు నమ్మకండి.. వాస్తవాలు ఇవే..-asthama myths and facts story about on world asthma day 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Asthma Day 2022 | ఆస్తమా గురించిన అపోహలు నమ్మకండి.. వాస్తవాలు ఇవే..

World Asthma Day 2022 | ఆస్తమా గురించిన అపోహలు నమ్మకండి.. వాస్తవాలు ఇవే..

HT Telugu Desk HT Telugu
May 03, 2022 11:57 AM IST

ఆస్తమా అనేది దీర్ఘకాలిక సమస్య. ఇది ఊపిరితిత్తుల పరిస్థితిని క్లిష్టం చేస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. భారతదేశంలో లక్షలాది మంది ప్రజలు దీనితో బాధపడుతున్నారు. ఇది ఊపిరితిత్తులకు దీర్ఘకాలిక సమస్యనిస్తుంది కాబట్టి.. ఆస్తమా గురించి సరైన సమాచారం తెలిసి ఉండాలి. అప్పుడే దానిని నియంత్రించవచ్చు. ఆస్తమా దినోత్సవం సందర్భంగా.. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఆస్తమా దినోత్సవం
ఆస్తమా దినోత్సవం

World Asthma Day 2022 | ఆస్తమాతో లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది వారి ఆరోగ్యంపై, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది... గురక, దగ్గు వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ వ్యాధి పరిస్థితి చిన్నది కావచ్చు లేదా రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించవచ్చు. ఇది మీ ఊపిరితిత్తులకు గాలిని తీసుకువెళ్ళే వాయుమార్గాలను ప్రభావితం చేస్తుంది. చల్లటి గాలి, వైరస్‌లు, పొగాకు పొగ, దుమ్ము, పుప్పొడి, జంతువుల చర్మం... ఆస్తమాను పెంచుతాయి.

కొంతమందిలో తీవ్రమైన ఆస్తమా ప్రాణాపాయాన్ని కలిగిస్తుంది. ఆస్తమా ఎటాక్ కొన్ని నిమిషాలు లేదా రోజులు ఉండవచ్చు. ఆస్తమా ఎఫెక్ట్ ఎక్కడైనా, ఎప్పుడైనా జరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 339 మిలియన్లకు పైగా ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన జీవితాన్ని గడపడానికి ఆస్తమాకు చికిత్స పొందడం చాలా ముఖ్యం. అందుకే అపోహలు ఏంటో వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలి.

* అపోహ - బాల్యంలో ఆస్తమా వస్తే వయస్సుతో పాటు పోతుంది.

వాస్తవం - యుక్తవయస్సులో ఆస్తమా లక్షణాలు మళ్లీ కనిపించవచ్చు.

ఆస్తమాకు ఎటువంటి నివారణ లేదు. కానీ ఆస్తమా లక్షణాల ఫ్రీక్వెన్సీ, తీవ్రత వయస్సుతో పాటు తగ్గవచ్చు. ఆస్తమా ఉన్న పిల్లలు పెద్దయ్యాక వారి పరిస్థితి మెరుగుపడవచ్చు. ఆస్తమా ట్రిగ్గర్‌లకు వారి సున్నితత్వం కూడా తగ్గుతుంది.

* అపోహ - ఆస్తమా ఉన్నవారు వ్యాయామం చేయకూడదు.

వాస్తవం - క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆస్తమా రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

వ్యాయామం చేయడం వల్ల ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయనేది అపోహ మాత్రమే. కానీ వాస్తవం ఏమిటంటే.. శారీరక శ్రమ ఊపిరితిత్తుల పనితీరును బలోపేతం చేయడానికి, మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది ఆస్తమా ఉన్న వ్యక్తుల మొత్తం ఫిట్‌నెస్, జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. అయినప్పటికీ కఠినమైన శారీరక శ్రమ ఆస్తమా దాడికి దారి తీస్తుంది కాబట్టి.. వాటిని నివారించాలి.

* అపోహ - ఉబ్బసం కోసం ఉపయోగించే మందులు అలవాటు అయిపోయి.. కాలక్రమేణా అవి పనికిరావు.

వాస్తవం - ఆస్తమా మందులు సురక్షితమైనవి. దానిని తగ్గించేందుకు సమర్థవంతంగా పనిచేస్తాయి.

ఆస్తమా అనేది దీర్ఘకాలిక పరిస్థితి కాబట్టి.. వాటి లక్షణాలను తగ్గించడానికి దీర్ఘకాలిక మందులు అవసరం. ఈ మందులు శ్వాసనాళాల చుట్టూ ఉన్న కండరాలను సడలించడంతోపాటు.. వాయుమార్గాలను విస్తృతం చేస్తాయి. బ్రోంకోడైలేటర్స్, ఇన్​హేల్డ్, కార్టికోస్టెరాయిడ్స్ ఆస్తమాను తగ్గించడానికి ఉపయోగించే కొన్ని మందులు. ఈ మందులు అలవాటు అవ్వవు. ఆస్తమాను నియంత్రణలో ఉంచడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

* అపోహ - ఆస్తమా ప్రాణాంతకం కాదు.

వాస్తవం - ఒక్కోసారి ప్రాణాంతకం అయ్యే అవకాశముంది.

ఆస్తమా అనేది లక్షలాది మందిని ప్రభావితం చేసే దీర్ఘకాలిక, నయం చేయలేని వ్యాధి. చికిత్స చేయకుండా వదిలేస్తే.. దాని లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. పైగా ప్రాణాంతకం కూడా కావచ్చు. ఆస్తమా వల్ల ప్రాణాపాయం అనేది చాలా అరుదు. తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతున్న వ్యక్తులు తీవ్రమైన లక్షణాలు ఎదుర్కోకుండా.. వాటిని నిరోధించాలి.

* అపోహ - ఆస్తమా లక్షణాలు తలెత్తినప్పుడు మాత్రమే చికిత్స చేయాలి.

వాస్తవం - వైద్యుడు సూచించిన సాధారణ మందులతో ఆస్తమాను నియంత్రించవచ్చు.

కొన్ని మందులు త్వరిత ఉపశమనాన్ని అందిస్తాయి. కొందరు ఆస్తమా దాడి సమయంలో మాత్రమే మెడిసిన్ తీసుకుంటారు. ఆస్తమా దీర్ఘకాలికంగా ఉన్నందున.. దీర్ఘకాలిక ఆస్తమా నియంత్రణ మందులు కూడా ఉపయోగించవచ్చు.

* అపోహ - శ్వాసలో గురక లేకపోతే, అది ఆస్తమా కాదు.

వాస్తవం - శ్వాసలో గురక లేకుండా ఆస్తమా రావచ్చు.

* అపోహ - ఉబ్బసం ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే లక్షణాలను అనుభవిస్తారు.

వాస్తవం - ఉబ్బసం లక్షణాలు వ్యక్తులను బట్టి మారవచ్చు.

ఉబ్బసం గురించి సరైన వాస్తవాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అపోహలు సరైన చికిత్స తీసుకోకుండా చేస్తాయి. కాబట్టి డాక్టర్ సూచించిన విధంగా మందులు తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా ఆస్తమాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్