Benefits of Walnut। మెదడుకు మేత, గుండెకు ఆరోగ్యం కావాలా? అయితే తినండి వాల్‌నట్‌!-from boosting brain power to heart health know amazing benefits of eating walnuts ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  From Boosting Brain Power To Heart Health, Know Amazing Benefits Of Eating Walnuts

Benefits of Walnut। మెదడుకు మేత, గుండెకు ఆరోగ్యం కావాలా? అయితే తినండి వాల్‌నట్‌!

HT Telugu Desk HT Telugu
Jul 22, 2023 07:07 AM IST

Benefits of Walnuts: వాల్‌నట్స్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, ఇందులో ఒమేగా-3 కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. వాల్‌నట్‌లు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలలో కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి.

Walnut Benefits
Walnut Benefits (Pixabay)

Walnut Benefits: మన ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని పోషకాలు గింజలు, విత్తనాల్లో లభిస్తాయి. ప్రతీ గింజ దేనికదే ప్రత్యేకమైన రుచిని, ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ గింజలు, విత్తనాల్లో ప్రత్యేకించి మన మెదడు పనితీరును పెంచేవి, మనకు ప్రశాంత భావాలను కలిగించే నట్ ఏదైనా ఉందా అంటే, వాల్‌నట్ అని సమాధానం వస్తుంది. ఇందుకు తగ్గట్లుగా వాల్‌నట్‌ ఆకృతి కూడా మనిషి మెదడును పోలి ఉంటుంది. వాల్‌నట్స్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, ఇందులో ఒమేగా-3 కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు క్షీణత, గుండె జబ్బులు, క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇంకా వాల్‌నట్‌లలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు కూడా సమ్మృద్ధిగా లభిస్తాయి. అందుకే వీటిని సూపర్‌ఫుడ్‌లుగా పరిగణిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

వాల్‌నట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా వాల్‌నట్‌లను ఒక చిరుతిండిగా తింటారు. అయినప్పటికీ సలాడ్‌లు, పాస్తాలు, తృణధాన్యాలు, సూప్‌లు వంటి ఆహార పదార్థాలలో కూడా కలుపుతారు. ఇంకా వాల్‌నట్ల నుంచి నూనెను తీస్తారు. దీనిని తరచుగా సలాడ్ డ్రెస్సింగ్‌లలో ఉపయోగిస్తారు, వాల్‌నట్‌ నూనె అత్యంత ఖరీదైన వంట నూనెగా పేర్కొంటారు.

ఈ వాల్‌నట్స్ కేవలం మీ ఆరోగ్యం కోసం మాత్రమే తినడం కాదు, మీ చర్మ, జుట్టు సంరక్షణ కోసం కూడా ఇవి మేలు చేస్తాయి. వాల్‌నట్‌లు తినడం ద్వారా కలిగే ప్రయోజనాలలో కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి.

మెదడుకు మేత

వాల్‌నట్స్‌లో మెదడు బాగా పని చేసే కొన్ని పోషకాలు ఉంటాయి. ఒత్తిడి భావాలను తగ్గిస్తుంది. మెదడు పనితీరు మెరుగుపరచడంలో, ఏకాగ్రతను పెంచడంలో, జ్ఞాపకశక్తికి పదును పెట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి తింటే మతిమరుపు తగ్గుతుంది, అల్జీమర్స్ వ్యాధి ముప్పును కూడా తగ్గిస్తుందని వివిధ అధ్యయనాలు తెలిపాయి.

గుండెకు ఆరోగ్యం

వాల్‌నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి శరీరంలోని చెడు కొవ్వును తొలగించడంలో సహాయపడుతుంది, వీటిలో ఉండే ఆల్ఫాలినోలిక్ యాసిడ్ ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

ఇతర ప్రయోజనాలు

వాల్‌నట్స్‌లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలోని ఎముకల నిర్మాణానికి, ఎములను దృఢంగా ఉంచేందుకు అవసరం. వీటిలో ఫైబర్ కూడా ఎక్కువ కాబట్టి ఇవి మీ జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. అలాగే పొటాషియం, జింక్, కాల్షియం, ఇనుము వంటి ఖనిజాలు నిండుగా ఉండే వాల్‌నట్‌లు తినడం వలన బరువును తగ్గిస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేయడంలో, జుట్టు పల్చబడకుండా కూడా కాపాడటంలో కూడా వాల్‌నట్స్‌ శ్రేష్ఠమైనవి.

రోజుకు ఎన్ని తినాలి?

వాల్‌నట్‌ల ప్రయోజనాలు మీరు ఒక రోజులో ఎంత తింటారు, ఎలా తింటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ కూడా తినకూడదు. రోజుకు 3 నుండి 4 వాల్‌నట్స్ తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణుల సలహా. వాల్‌నట్‌లను తినడానికి ముందు కనీసం 5 నుండి 6 గంటలు నానబెట్టండి. నీటిలో నానబెట్టిన వాల్‌నట్‌లను ఉదయం అల్పాహారంతో పాటుగా లేదా సాయంత్రం చిరుతిండిగా తినవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం