Badam Chicken Handi । బాదం చికెన్ హండి.. దీనిని ఒక్కసారి తింటే వదలమండి!
Badam Chicken Handi Recipe: బాదం చికెన్ హండి ఎంతో ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఉంది, చూసి తెలుసుకోండి.
Eid al-Fitr Recipes: ఈద్ అల్-ఫితర్ సందడి మొదలైంది. ముస్లింలు ఎంతో వైభవంగా జరుపుకునే ఈ పండగ ఇది. రుచికరమైన విందు భోజనాలను అందరితో కలిసి ఆస్వాదించే సమయం ముందుంది. మీరు మాంసాహార ప్రియులైతే మీకోసం ఒక ప్రత్యేకమైన రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఇప్పటివరకు చికెన్ లో ఎన్నో రకాల వెరైటీలను రుచి చూసి ఉండవచ్చు. వీటన్నింటిలో బాదం చికెన్ హండి ఎంతో ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. సెలవు రోజున విందులు వినోదాలతో ఆనందంగా గడిపే సమయంలో లేదా ఆదివారం రోజున బాదం చికెన్ హండి కచ్చితంగా మీ మనసును సంతృప్తి పరుస్తుంది. బాదం చికెన్ హండి రెసిపీని ఈ కింద చదివి మీరూ ప్రయత్నించండి.
Badam Chicken Handi Recipe కోసం కావలసినవి
- ¼ కప్ ఉడికించిన బాదం పలుకులు
- 5 ఉల్లిపాయలు
- 3 టేబుల్ స్పూన్లు నెయ్యి
- ½ కిలో చికెన్
- 1-అంగుళం దాల్చిన చెక్క
- 2 లవంగాలు
- 2 స్టార్ సోంపు
- 1 బిరియాని ఆకు
- 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- ½ కప్పు తాజా కొత్తిమీర
- 2 పచ్చిమిర్చిలు
- 2 స్పూన్ ధనియాల పొడి
- ఉప్పు రుచికి తగినంత
- ½ కప్పు పెరుగు
- ½ కప్పు నీరు
- 1 టేబుల్ స్పూన్ నెయ్యి (పోపు కోసం)
- ¼ టీస్పూన్ ఇంగువ
- ¼ స్పూన్ స్టోన్ ఫ్లవర్ పౌడర్
బాదం చికెన్ హండి తయారీ విధానం
1. ముందుగా బాదంపప్పులను సుమారు 25 నిమిషాల పాటు ఉడికించాలి.
2. ఒక బాణాలిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి, ఉల్లిపాయలు వేసి రంగుమారే వరకు వేయించాలి.
3. ఇప్పుడు మిక్సర్ గ్రైండర్‌లో ఉడికించిన బాదంపప్పు, వేయించిన ఉల్లిపాయలను వేసి, కొన్ని నీళ్లతో పోసి పేస్ట్‌లా చేయాలి.
4. ఇప్పుడు ఒక హండీలో నెయ్యి వేడి చేయండి. ఇందులో శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను వేసి వేయించండి, ఆపై మసాలా దినుసులను వేసి సుమారు 4 నుండి 5 నిమిషాలు వేయించాలి.
5. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తాజా కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
6. ఇప్పుడు బాదం ఉల్లిపాయ పేస్ట్‌ను కూడా వేసి బాగా కలపాలి.
7. ఇలా కలుపుతున్నపుడు పలుచటి పెరుగు వేయండి, కొద్దిగా నీరు పోసుకొని 10 నిమిషాల పాటు నెమ్మదిగా చిన్న మంట మీద ఉడికించాలి.
8. చికెన్ ఉడుకుతున్నప్పుడు, నెయ్యిలో ఇతర మసాలా దినుసులను వేయించండి, ఇంగువను వేయించి కలపండి.
9. చివరగా, చికెన్ ఉడికిన తర్వాత రాతి పూల పొడిని చల్లుకోండి.
అంతే, రుచికరమైన బాదం చికెన్ హండి రెడీ. అన్నంతో గానీ, రోటీతో గానీ తింటే అదిరిపోతుంది.
సంబంధిత కథనం
టాపిక్