Eid-Ul-Fitr 2023 । భారతదేశంలో నెలవంక దర్శనం ఎప్పుడు? ఈద్ తేదీ, ఇతర సమాచారం ఇదిగో!
Eid-Ul-Fitr 2023: ఈద్-అల్-ఫితర్ ఎప్పుడు? ఈద్-అల్-ఫితర్ సందడి మొదలైంది. భారతదేశంలో నెలవంక దర్శనం ఎప్పుడు, రంజాన్ మాసం ఎప్పుడు ముగుస్తుంది, తదితర వివరాలు తెలుసుకోండి
Eid-Ul-Fitr 2023: ఈద్ అల్-ఫితర్ అనేది ఇస్లాం కమ్యూనిటీలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి, ఇది రంజాన్ అని పిలిచే నెల రోజుల ఉపవాస దీక్ష ముగింపును సూచిస్తుంది. ఈరోజుతో ముస్లింలు నెలరోజుల పాటు రంజాన్ మాసంలో కొనసాగించిన ఉపవాసాలు విరమిస్తారు. ఈ వేడుకతో ఇస్లామిక్ క్యాలెండర్‌లోని పదవ నెల షవ్వాల్ ప్రారంభం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ ఈ సంతోషకరమైన సందర్భాన్ని ఐకమత్యంతో జరుపుకుంటారు.
ఈద్ అల్-ఫితర్ అనేది ముస్లింలకు అతిపెద్ద పండగ, ఇది క్షమాగుణం, దయ, దాతృత్వాన్ని ప్రతిబంబించే పండగ. ఈ పండగ రోజున ముస్లింలు అందరూ నూతన వస్త్రాలు ధరిస్తారు, సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ పండగ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. బంధువులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో కలిసి ఆనందంతో వేడుక జరుపుకుంటారు. కలిసి విందు భోజనాలు చేసుకుంటారు. తమ ఆహారాన్ని మరొకరితో పంచుకుంటారు, తియ్యటి ఖీర్ తినిపించుకుంటారు. అందుకే ఈ పండుగకు మీఠీ ఈద్ అనే పేరు కూడా ఉంది.
Eid-Ul-Fitr 2023 Date.. ఈద్-అల్-ఫితర్ ఎప్పుడు?
ఈద్ అల్-ఫితర్ పండగను ఇస్లామిక్ క్యాలెండర్ హిజ్రీ ప్రకారం, పదవ నెల అయిన షవ్వాల్ మొదటి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం, ఇది ఏప్రిల్ 22 న వస్తుంది. అయితే ఇది నెలవంక దర్శనంతో ముడిపడి ఉంటుంది. చాంద్ రాత్ అనేది దక్షిణాసియా సంస్కృతులలో ప్రత్యేకించి.. భారతదేశం, పాకిస్తాన్ , బంగ్లాదేశ్‌లలో ఈద్-ఉల్-ఫితర్ ముందు రాత్రిని సూచించడానికి ఉపయోగించే పదం. ఇక్కడ "చాంద్" అంటే చంద్రుడు అలాగే "రాత్" అంటే ఉర్దూలో రాత్రి అని అర్థం. కాబట్టి ఈ పదం ముస్లింలు నెలవంక (Crescent Moon) ను చూసే రాత్రిని సూచిస్తుంది, నెలవంక కనిపిస్తే పండగ సందడి ప్రారంభమవుతుంది, ఆ మరుసటి రోజే పండగను వైభవంగా జరుపుకుంటారు.
నివేదికల ప్రకారం, ఏప్రిల్ 20న సూర్యగ్రహణం అమావాస్య (Hybrid Solar Eclipse 2023) రెండూ ఒకేసారి రావడంతో సూర్యాస్తమయం తర్వాత షవ్వాల్ నెలవంక కేవలం 0.2% మాత్రమే ప్రకాశిస్తాడు, కాబట్టి సౌదీ అరేబియాలోని మక్కాలో సూర్యాస్తమయం తర్వాత నెలవంక దర్శనం దాదాపు అసాధ్యం.
భారతీయ ముస్లింలు అలాగే ఇతర దక్షిణాసియా దేశాలలో ఉన్నవారు శుక్రవారం అనగా ఏప్రిల్ 21న రంజాన్ ఉపవాసాన్ని సాయంత్రం విరమించిన తర్వాత నెలవంకను చూసేందుకు సిద్ధమవుతారు. నెలవంక కనిపించినట్లయితే, చాంద్ రాత్ శుక్రవారం ఇస్లామిక్ నెల షవ్వాల్ ప్రారంభానికి గుర్తుగా ఉంటుంది, మరుసటి రోజు అంటే ఏప్రిల్ 22, 2023 శనివారం రోజున ఈద్-ఉల్-ఫితర్ (Eid-Ul-Fitr 2023 Date in India) జరుపుకుంటారు.
ఒకవేళ నెలవంక కనిపించకపోతే, భారతదేశంలోని ముస్లింలు ఉపవాసం కొనసాగిస్తారు, ఈద్-ఉల్-ఫితర్ ఆదివారం అంటే ఏప్రిల్ 23, 2023న జరుపుకుంటారు.
సంబంధిత కథనం