Eating Spices in Summer|వేసవిలో కారం ఎక్కువ తింటున్నారా? జాగ్రత్త, ఈ ప్రమాదం పొంచి ఉంది!
Eating Spices in Summer: చాలా మంది కారంగా ఉండే స్పైసీగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. అయితే ఎండాకాలంలో కారంగా ఉండే వాటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు, ఎందుకో తెలుసుకోండి.
Summer Health Care: మనదేశంలో అన్ని కాలాల్లోకెల్లా కఠినంగా గడిచేది వేసవి కాలం. మండె ఎండలు, ఉక్కపోతలు భరించలేని విధంగా ఉంటాయి. ఈ సీజన్ లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరుగుతాయి. ఫలితంగా శరీరంలో నీటి స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. తద్వారా డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి హైడ్రేటెడ్‌గా ఉండటానికి తగినంత నీటిని, ఇతర ఆరోగ్యకరమైన ద్రవాలను తీసుకోవడం చాలా కీలకం. అదేవిధంగా ఈ వేసవిలో మనం తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒంటికి చలువ చేసే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుకోవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఇదిలా ఉంటే, కొంతమంది కారం ఎక్కువగా ఉండే స్పైసీ ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. అయితే మాంసాహారం, మసాలాలు (Eating Spices in Summer) ఎక్కువ కలిగిన ఆహారాలు ఎండాకాలంలో పరిమితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు. మాంసాహారం, నూనె పదార్థాలు కడుపులో అసౌకర్యానికి కలిగిస్తాయి. అదనంగా వీటిలో ఉండే కారం, మసాలాలు పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. అసలే ఎండాకాలం, ఎండవేడికి శరీరం మండిపోతుంటుంది. అదనంగా కారం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వలన శరీర వేడి గణనీయంగా పెరిగిపోతుంది. వేసవిలో మూడు మసాలాలను చాలా పరిమితంగా తీసుకోవాలని వైద్యులు అంటున్నారు, అవేమిటో ఇక్కడ చూడండి.
Red Chilli- కారం పొడి
వేసవిలో కారం పొడిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపు, గొంతు, ఛాతీలో మంట ఎక్కువ ఉంటుందు. ఇది, శరీర ఉష్ణోగ్రతను గణనీయంగా పెంచుతుంది, శరీరంలో సరైన ఉష్ణోగ్రతను నిర్వహించడంలో వ్యవస్థలకు కష్టతరం చేస్తుంది. అదనంగా, శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కారం తినడం తగ్గించాలి.
Garlic- వెల్లుల్లి
వెల్లుల్లి దాదాపు అన్ని కూరల్లో వాడే ఒక మూలిక, మసాలా దినుసు, సుగంధ ద్రవ్యం. వెల్లిల్లిలో చాలా ఔషధ గుణాలు ఉన్నప్పటికీ దీనిని పరిమితంగా తీసుకోవాలని సూచిస్తారు. చలికాలంలో వెల్లుల్లి మోతాదు పెరిగినా నష్టం లేదు కానీ, వేసవిలో వెల్లుల్లి మరింత వేడి చేస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరిగి వివిధ సమస్యలకు దారితీస్తుంది. వేసవిలో వెల్లుల్లిని అధికంగా తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన పెరుగుతుంది, చెమట వాసన ఘాటుగా ఉంటుంది. అంతేకాకుండా కడుపులో ఆమ్లత్వం, రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తుతాయి.
Ginger- అల్లం
వెల్లుల్లితో పాటు కూరల్లో మనం విరివిగా ఉపయోగించే మరొక సుగంధ ద్రవ్యం అల్లం. అల్లం కూడా అనేక ఔషధ గుణాలకు ప్రసిద్ధి. వంటకాల్లో అల్లం వేసుకోవడం వలన రుచి, ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయి నిజమే. కానీ, వేసవిలో అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఇది కడుపులో అసౌకర్యం, విరేచనాలకు కారణమవుతుంది. అల్లం సహజంగా వేడి గుణాలను కలిగి ఉంటుంది, తద్వార ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచి నిర్జలీకరణానికి కారణమవుతుంది.
సంబంధిత కథనం