Coffee or Green Tea । కప్పు కాఫీనా లేక గ్రీన్ టీనా? ఏది తాగితే ఆరోగ్యకరం?
Coffee or Green Tea: మీరు కాఫీ ప్రియులా లేక గ్రీన్ టీ తాగటానికి ఇష్టపడతారా? ఈ రెండింటిలో ఏది తాగడ మంచిది? ఇక్కడ తెలుసుకోండి.
Coffee or Green Tea: చాలా మందికి ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (Breakfast) లేకపోయినా సరే కానీ, ఒక కప్పు కాఫీ లేనిదే రోజు ప్రారంభం కాదు. వేడివేడిగా ఒక కప్పు కాఫీ లేదా టీని తాగేసి చైతన్యవంతమవుతారు, తమ పనుల్లో నిమగ్నం అయిపోతుంటారు. ఇటీవల కాలంగా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగటం కారణంగా, అలాగే వివిధ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మామూలు టీకి బదులు గ్రీన్ టీ తాగడం ప్రారంభించారు. మరి మీరు కాఫీ ప్రియులా? లేక గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడతారా? ఆరోగ్యం కోసం కాఫీకి బదులు టీ తాగాలా? ఈ రెండింటిలో ఏది తాగడం బెటర్ అని మీరు ఆలోచిస్తుంటే, దానికి సమాధానం ఇక్కడ తెలుసుకోండి.
Coffee- కాఫీ
కాఫీ అనేది కెఫీన్‌ను కలిగి ఉన్న ఒక ప్రసిద్ధ పానీయం, దీనిని తాగినపుడు ఇది శక్తి స్థాయిలను పెంచుతుంది, చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది. చక్కెర లేకుండా మితంగా తీసుకుంటే టైప్ 2 మధుమేహం (Diabetes) , కాలేయ క్యాన్సర్‌తో సహా వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అని వివిధ అధ్యయనాలు పేర్కొన్నాయి. సాధారణంగా రోజుకు మూడు నుండి ఐదు కప్పులకు మించకుండా మితంగా కాఫీ తాగే వారిలో గుండె ఆరోగ్యంపై కూడా కొన్ని ప్రయోజనకరమైన ప్రభావాలను చూపుతుంది, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 16% తక్కువగా ఉంటుంది అని పరిశోధనలు సూచిస్తున్నాయి. అదనంగా, కాఫీ రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తుంది, రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
మరోవైపు, కాఫీ అధికంగా తీసుకోవడం, ముఖ్యంగా చక్కెర ఎక్కువగా, అధిక క్రీమ్‌తో లోడ్ చేసి తీసుకున్నట్లయితే, అది గుండె ఆరోగ్యానికి హానికరం. కాఫీ అతిగా తాగితే శరీరంలో పెరిగిన కెఫిన్ కంటెంట్.. గుండె దడ, ఆందోళన, నిద్రలేమికి కారణమవుతుంది. అంతేకాకుండా, అధిక మొత్తంలో చక్కెర, క్రీమ్ తీసుకున్నప్పుడు బరువు పెరుగుట, ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి కాఫీని చక్కెర లేకుండా ఉదయం మితంగా తాగడం శ్రేయస్కరం. సాయంత్రం తర్వాత కాఫీ తాగకపోవడమే మంచిది.
Green Tea- గ్రీన్ టీ
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు గ్రీన్ టీని తాగటానికి ఇష్టపడుతున్నారు. గ్రీన్ టీలో క్యాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, రక్తపోటును నియంత్రించడం ద్వారా గ్రీన్ టీ గుండె జబ్బుల నుంచి రక్షించే ప్రభావాలను కలిగి ఉంటుంది. రోజూ మితంగా గ్రీన్ టీ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 28% తక్కువగా ఉంటుంది. అదనంగా, గ్రీన్ టీ రక్త ప్రసరణ సమస్యలను దూరం చేస్తుంది.
గ్రీన్ టీలో కూడా కెఫిన్ ఉంటుంది, అయితే కాఫీ కంటే చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. దీని అర్థం గ్రీన్ టీని కూడా ఎక్కువగా తాగితే అది నిద్రలేమి లేదా ఆందోళన వంటి కొన్ని ప్రతికూల దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అంతేకాకుండా, రక్తం సంబంధిత సమస్యలు ఉన్నవారికి, గర్భిణీలకు గ్రీన్ టీని సిఫారసు చేయరు. ఎందుకంటే గ్రీన్ టీలోని కెఫీన్, ఇతర సమ్మేళనాలు రక్తప్రసరణలో జోక్యం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి కాబట్టి.
చివరగా చెప్పేది ఏమిటంటే, గ్రీన్ టీ లేదా కాఫీ ఏదైనా తాగొచ్చు, అయితే అది మితంగా ఉండాలి. కొంతమంది, ముఖ్యంగా అమ్మాయిలు బరువు తగ్గడం, చర్మ ప్రయోజనాల కోసం అతిగా గ్రీన్ టీ సేవిస్తారు. అలాగే కాఫీ వ్యసనంతో చాలా మంది ఎక్కువ కప్పుల కాఫీని తాగేస్తారు. ఈ రెండు సందర్భాలలో వీటి వల్ల ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలు ఉంటాయని గమనించాలి. వీటిని మితంగా తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
సంబంధిత కథనం