Egg Kheema Recipe । కోడిగుడ్డు కీమా కూర.. దీని రుచి చూస్తే అంటారు ఔరా!
Egg Kheema Recipe: ఉడకబెట్టిన కోడిగుడ్డు కూర, కోడిగుడ్డు ఫ్రై, ఆమ్లెట్ వంటివి తినితినీ బోర్ కొట్టిందా? కొత్తగా ఇలా కోడిగుడ్డు కీమా తిని చూడండి, ఎగ్ కీమా రెసిపీ ఇక్కడ ఉంది.
Ramadan 2023 Recipes: కీమా లేదా ఖీమా అనేది ప్రసిద్ధ మాంసాహార వంటకం. సాధారణంగా మటన్ ముక్కలను వీలైనంత చిన్నముక్కలుగా తరిగి ఉల్లిపాయలు, మసాలాలు కలిపి చేస్తారు. ఇదే తరహాలో చికెన్ కీమా కూడా చేయడం ప్రారంభించారు. శాకాహారులు సోయా చంక్స్ తో కీమా చేసుకొని తృప్తి పొందుతారు. అయితే కోడిగుడ్డును కూడా కీమా లాగా వండుకోవచ్చు. మీరు ఎప్పుడూ చేసుకునే ఉడకబెట్టిన కోడిగుడ్డు లేదా కోడిగుడ్డు ఫ్రై తినాలనిపించకపోతే ఇలా ఎగ్ కీమా చేసుకొని తినవచ్చు.
ఎగ్ కీమాను రోల్స్, శాండ్‌విచ్‌లలో స్టఫ్ చేయడానికి ఉపయోగిస్తారు. మీరు దాబా శైలిలో వండుకుంటే అన్నం, చపాతీ లేదా దోశలకు కూడా తినడానికి అద్భుతంగా ఉంటుంది. దాబా స్టైల్ ఎగ్ కీమా రెసిపీ ఈ కింద అందిస్తున్నాం, ఇక్కడ ఇచ్చిన సూచనలు చదివి మీరు కూడా సులభంగా ఎగ్ కీమా చేసుకోవచ్చు.
Egg Kheema Recipe కోసం కావలసినవి
- 4 ఉడికించిన గుడ్లు
- 1/2 కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి
- 1/2 కప్పు టమోటాలు తరిగినవి
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- 1 బిర్యానీ ఆకు
- 2 పచ్చి ఏలకులు
- 2 లవంగాలు
- 1 దాల్చిన చెక్క
- 1/2 టీస్పూన్ జీలకర్ర
- 2 పచ్చి మిరపకాయలు
- 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1 టీస్పూన్ కారం
- 1 టీస్పూన్ గరం మసాలా
- 1/2 స్పూన్ ధనియాల పొడి
- 1/2 కప్పు పచ్చి బఠానీలు
- 1 కప్పు కొత్తిమీర, పుదీనా ఆకులు
- రుచికి తగినంత ఉప్పు
కోడిగుడ్డు కీమా కూర తయారీ విధానం
- గుడ్లను గట్టిగా ఉడకబెట్టండి, చల్లబడిన తర్వాత వాటిని చిన్న చిన్నని ముక్కలు కోసి, పక్కన పెట్టండి.
- ఒక గంజులో నూనె వేడి చేసి దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించండి.
- సుగంధ దినుసులు వేగాక, ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అనంతరం టొమాటోలను వేసి మెత్తగా వేయించాలి.
- ఇప్పుడు కారం, మసాలా, ధనియాలపొడి వేసి బాగా కలపండి. అనంతరం పచ్చి బఠానీలను వేసి 2 నుండి 3 నిమిషాలు వేయించాలి.
- ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి ఆపైన కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి కలపండి. మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి.
- చివరగా తరిగిన కోడిగుడ్డు ముక్కలు వేసి మసాలా అంటుకునేలా మృదువుగా కలపండి.
అంతే, రుచికరమైన ఎగ్ కీమా రెడీ.. అన్నం, చపాతీ, పరోటా, దోశ, బ్రెడ్.. ఇలా దేనితోనైనా తినండి, అద్భుతంగా ఉంటుంది.
సంబంధిత కథనం