Kheema Pakora । కరకరలాడేలా కీమా పకోడి.. తింటూ పండగ చేస్కోండి!
Ramadan 2023- Kheema Pakora Recipe: రంజాన్ మాసం ఆరంభమయినట్లే. ఈ ప్రత్యేకమైన సమయంలో రుచికరమైన, శక్తివంతమైన ఆహారం తినాలనుకుంటే ఇక్కడ ప్రత్యేమైన రెసిపీ ఉంది. కీమా పకోడి ఎలా చేయాలో చూడండి.
Ramadan 2023: రంజాన్ మాసం దాదాపు ప్రారంభమయినట్లే, దీనికి సంబంధించిన తేదీలు అంతటా ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే ఇది నెలవంక దర్శనం మీద ఆధారపడి ఉంటుంది. ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుడి చక్రాన్ని అనుసరిస్తుంది. రంజాన్ 2023 నెలవంక సౌదీ అరేబియా, యూఎఇ, యూకే తదితర దేశాలలో మార్చి 22న కనిపించింది, ఈ క్రమంలో ఆయా దేశాలు 2023 రంజాన్ మొదటి ఉపవాసాలు మార్చి 23 నుంచి ప్రారంభిస్తున్నాయి. ఒక రోజు తర్వాత అంటే మార్చి 24 నుంచి భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మొదలైన దేశాలలో రంజాన్ 1444 AH ప్రారంభం అవుతుంది.
ట్రెండింగ్ వార్తలు
రంజాన్ నెలలో ఉపవాసం ఉండటం ఇస్లాం మతంలో ప్రధానమైనది. ఈ సందర్భంగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత తినాల్సి ఉంటుంది. రంజాన్ సందర్భంగా ప్రత్యేక వంటలు, బలవర్థకమైన ప్రోటీన్ ఆహారాలు తీసుకోవడం చేస్తారు.
ఈ సందర్భంగా ప్రత్యేకమైన రెసిపీలు ఇక్కడ అందిస్తున్నాం. శక్తి స్థాయిలను పెంచేటువంటి కీమా పకోడి రెసిపీని ఇక్కడ చూడండి. ఇది ఎంతో రుచికరమైన వంటకం, అందరూ దీనిని ఇష్టంగా తింటారు.
Kheema Pakora Recipe కోసం కావలసినవి
- కీమా మాంసం 1 కేజీ (చికెన్ లేదా మటన్)
- ఉల్లిపాయలు పెద్దవి 2
- పచ్చి మిరపకాయలు అవసరం మేరకు
- అల్లం పేస్ట్ 1/2 టీస్పూన్
- వెల్లుల్లి పేస్ట్ 1/2 టీస్పూన్
- జీలకర్ర 3/4 టీస్పూన్లు
- శనగ పిండి 6-7 టేబుల్ స్పూన్లు
- పసుపు పొడి 1/3 tsp
- ధనియాల పొడి 1 tsp
- జీలకర్ర పొడి 1 tsp
- మిరియాల పొడి 1/2 టీస్పూన్
- తాజా కొత్తిమీర అవసరం మేరకు
- ఉప్పు రుచికి తగినంత
- డీప్ ఫ్రై చేయడానికి నూనె
కీమా పకోడి తయారు చేసే విధానం
- ముందుగా కీమాను శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో తీసుకోండి.
- అనంతరం మరొక గిన్నెలో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీలకర్ర వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్నికీమాలో వేసి, మాంసానికి బాగా పట్టేలా కలపాలి. అలాగే శనగ పిండి, మిగతా మసాలా పొడులు వేసి అన్నీ బాగా కలిపేయండి.
- అనంతరం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి, నూనె చాలా వేడిగా మారాలి.
- ఈలోపు ఖీమా మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకోండి. ఇప్పుడు వీటిని నూనెలో వేసి వేయించండి.
- కీమా ముద్దలు లోపల బాగా ఉడికేలా వేడిని సర్దుబాటు చేసుకోండి. ప్రధానంగా అధిక వేడి మీద వేయించాలి.
- ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలో టిష్యూ పేపర్ ఉంచి, అందులోకి ఫ్రై చేసిన ఖీమా ముద్దలు వేయండి, ఇది అదనపు నూనెను తీసివేస్తుంది.
అంతే, కీమా పకోడీలు రెడీ. ఈ వంటకాన్ని మీరు భోజనం సమయంలో స్టార్టర్‌గా లేదా సాయంత్రం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు.
సంబంధిత కథనం