Fry Fish Rice Recipe । మసాలాలతో ఫ్రై చేసిన ఫిష్ రైస్.. దీని టేస్ట్ అదుర్స్!
Fry Fish Rice Recipe: లంచ్ అయినా డిన్నర్ అయినా, రుచికరమైన ఫ్రై ఫిష్ రైస్ తినాలనుకుంటే ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
ఆదివారం రోజు దాదాపు ప్రతి ఇంట్లో ప్రత్యేకమైన వంటకాలు వండుకుంటారు. మీరు చికెన్, మటన్ వంటి మాంసాహారం కాకుండా అదనంగా సీఫుడ్ మీల్‌ను ఇష్టపడేవారైతే మీరు సులభంగా చేసుకునే ఒక వంటకం గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. చేపలు చాలా మంది ఎంతో ఇష్టమైన ఆహారం. మీరు ఫిష్ బిర్యానీ చాలాసార్లు తినే ఉంటారు, ఇది కాకుండా మరింత సరళంగా, తేలికంగా ఉండే ఫ్రై ఫిష్ రైస్ ఎప్పుడైనా తిన్నారా?
ఫ్రై ఫిష్ రైస్ కేవలం 30 నిమిషాలలో చేసుకోగలిగే ఒక రుచికరమైన వంటకం. మీరు దీనిని లంచ్ సమయంలో అయినా, డిన్నర్ సమయంలో అయినా, జర్నీలో ఉన్నప్పుడైనా, ఎప్పుడైనా ఈజీగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఫ్రైడ్ రైస్ లాగానే ఉంటుంది. కానీ భారతీయ మసాలాలు, మూలికలను ఉపయోగిస్తాం కాబట్టి, మంచి దేశీయ వంటకం అవుతుంది. ఫ్రై ఫిష్ రైస్ రెసిపీ ఈ కింద ఉంది చూడండి.
Fry Fish Rice Recipe కోసం కావలసినవి
- 1 కప్పు బియ్యం
- 1 ఉల్లిపాయ
- 2 నుండి 3 పచ్చిమిర్చి ముక్కలు
- 1/2 టీస్పూన్ తరిగిన వెల్లుల్లి
- 1 నుండి 2 టేబుల్ స్పూన్లు నూనె లేదా నెయ్యి
- 1/4 టీస్పూన్ మిరియాల పొడి
- 2 రెమ్మలు కరివేపాకు
- 1 స్ప్రింగ్ ఆనియన్
- 1 క్యారెట్
- ఉప్పు అవసరం అవసరం మేరకు
మెరినేషన్ కోసం
- 250 గ్రాముల చేప ముక్కలు
- 1/4 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1/2 స్పూన్ కారం
- 1/2 స్పూన్ గరం మసాలా
- 1/2 టేబుల్ స్పూన్ పసుపు
- 1 నిమ్మకాయ
- ఉప్పు రుచికి తగినంత
ఫ్రై ఫిష్ రైస్ తయారీ విధానం
- ముందుగా బియ్యాన్ని కడిగి, నానవెట్టి ఉడికించాలి. ఆ తర్వాత చల్లబరిచి వదులుగా చేయాలి.
- ఈలోపు చేపలను బాగా కడిగి, శుభ్రం చేసి మెరినేషన్ కోసం అవసరమైన మసాలాను చేప ముక్కలకు బాగా దట్టించి ఒక 10 నిమిషాలు పక్కనపెట్టండి.
- ఇప్పుడు బాణలిలో నూనె వేసి, వేడి చేసి,అందులో తరిగిన వెల్లుల్లి, కరివేపాకు ఆకులు వేసి దోరగా వేయించండి.
- ఆపై మెరినేట్ చేసిన చేపముక్కలను వేసి 3 నిమిషాలు వేయించండి, మరొక వైపు తిప్పి కూడా వేయించండి.
- ఈ సమయంలో మీరు మరిన్ని మసాలా పొడులు వేసుకొని వేయించవచ్చు. రెండు వేపులా వేయించిన చేప ముక్కలను ప్లేట్‌లోకి మార్చండి.
- ఇప్పుడు బాణలిలో మళ్లీ కొంత నూనె వేసి వేడి చేయండి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. ఆపై స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసి కలపాలి.
- ఇప్పుడు చల్లబరిచిన అన్నం, రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఆ వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు ఈ అన్నం, చేప ముక్కను సర్వింగ్ ప్లేటులోకి తీసుకుంటే ఫ్రై ఫిష్ రైస్ రెడీ. దోసకాయ సలాడ్ లేదా ఏదైనా రసం గ్రేవీతో తింటూ రుచిని ఆస్వాదించండి.
సంబంధిత కథనం