Chettinad Fish Fry Recipe । చెట్టినాడ్ ఫిష్ ఫ్రై.. ఒకసారి చేయండి ఇలా ట్రై, మళ్లీ మళ్లీ తింటారు!
Chettinad Fish Fry Recipe: చెట్టినాడ్ చికెన్ చాలా సార్లు తినే ఉంటారు, ఈసారి చెట్టినాడ్ ఫిష్ ట్రై చేసి చూడండి. చెట్టినాడ్ ఫిష్ ఫ్రై రెసిపీ ఇక్కడ అందిస్తున్నాం.
ఆదివారం రోజు పప్పుచారు తింటే ప్రతిరోజుకు ఈరోజుకు తేడా ఏముంటుంది, నోటికి ముక్క లేకపోతే ముద్ద ఎలా దిగుతుంది. వారంలో ఒక్కరోజైనా రుచికరంగా విందుభోజనం చేయకపోతే మనసుకు తృప్తి ఏముంటుంది? అందుకే మీ మనసుకు నచ్చేలా ఒక అద్భుతమైన రెసిపీని పరిచయం చేస్తున్నాం. మీరు చాలా సార్లు చెట్టినాడ్ చికెన్ తినే ఉంటారు, అయితే ఎప్పుడైనా చెట్టినాడ్ ఫిష్ తిన్నారా? తినకపోతే ఒకసారి దీని రుచి చూడండి.
చెట్టినాడ్ ఫిష్ ఇతర ఫిష్ ఫ్రై వంటకాల కంటే మరింత రుచిగా ఉంటుంది. ఇది కారంగా, కరకరలాడుతూ ఉంటుంది. ఈ ఫిష్ ఫ్రై రెసిపీలో మెరినేషన్ కోసం ఉపయోగించే మసాలా దినుసులు ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచిని అందిస్తాయి. ఈ చెట్టినాడ్ ఫిష్ ముక్కలను మీరు మధ్యాహ్నం లంచ్‌లో తినవచ్చు, సాయంత్రం 'డ్రింక్' లో నంజుకోవచ్చు, డిన్నర్ లోనూ అన్నంలో కలుపుకొని తినవచ్చు. మరి ఆలస్యం ఎందుకు చెట్టినాడ్ ఫిష్ కోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకోండి. చెట్టినాడ్ ఫిష్ రెసిపీ ఇక్కడ ఉంది, ఇక్కడ అందించిన సూచనల ప్రకారం చేయండి, వారాంతం విందులో పండగ చేస్కోండి.
Chettinad Fish Fry Recipe కోసం కావలసినవి
- 2 సుర్మై చేప / కింగ్ ఫిష్
- 2 టేబుల్ స్పూన్ల నూనె వేయించడానికి
- 7-8 వెల్లుల్లి రెబ్బలు
- 1 అల్లం తురుము
- 1 tsp జీలకర్ర
- 1 స్పూన్ ఫెన్నెల్
- 2 స్పూన్ ధనియాలు
- 2 స్పూన్ నల్ల మిరియాలు
- 1/2 టీస్పూన్ ఆవాలు
- 9-10 కరివేపాకు
- 1 స్పూన్ నూనె (గ్రైండ్ చేయడానికి)
- 1 టేబుల్ స్పూన్ నీరు
- 1/2 టమోటా
- 1 tsp కారం
- 2 స్పూన్ పసుపు పొడి
- 5 tsp చింతపండు సారం
- 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్
- రుచికి తగినంత ఉప్పు
- తాజా కొత్తిమీర
- నిమ్మకాయ ముక్కలు
చెట్టినాడ్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలి
1. ఫిష్ ఫిల్లెట్‌లను సమానమైన ముక్కలుగా కట్ చేసుకోండి, బాగా శుభ్రం చేసుకొని పక్కనపెట్టుకోండి.
2. ఒక పాన్‌లో వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, సోపు, కొత్తిమీర, మిరియాలు, ఆవాలు, కరివేపాకులను వేసి పొడిగా వేయించాలి.
3. అనంతరం వేయించిన మసాలా దినుసులను రోకలిలో దంచండి. కొద్దిగా ఉప్పు, నూనె , నీరు వేసి పేస్టులాగా నూరండి.
4.ఇప్పుడు టొమాటో ముక్కలు, పసుపు పొడి, కారం, ఉప్పు, చింతపండు సారం వేసి మెత్తని పేస్టులాగా నూరండి.
5. సిద్ధం చేసుకున పేస్టును చేప ముక్కలకు బాగా పట్టించండి.
6. ముక్కలపై కొంచెం కార్న్‌ఫ్లోర్‌ను చల్లండి. ఈ కార్న్‌ఫ్లోర్ మసాలా అంటుకోవడానికి సహాయపడుతుంది
7. ఇప్పుడు మసాలా దట్టించిన ఈ చేప ముక్కలను 15-20 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి మెరినేట్ చేయండి.
8. అరగంట తర్వాత ఒక పాన్‌లో నూనెను వేడి చేసి, అందులో మెరినేట్ చేసుకున్న చేపల వేయించాలి. రెండువైపులా గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
చివరగా నిమ్మకాయ ముక్కలు, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే చెట్టినాడ్ ఫిష్ ఫ్రై రెడీ, వేడిగా సర్వ్ చేసుకోండి. వీకెండ్ వేడుకలను ప్రారంభించండి.