Mushroom Cheese Sandwich। సూపర్ ఫాస్ట్‌గా చేసుకునే శాండ్‌విచ్ బ్రేక్‌ఫాస్ట్..!
బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు కూడా సమయం లేదా? ఫటాఫట్ గా రెండు బ్రెడ్ ముక్కలను తీసుకొని Mushroom Cheese Sandwich చేసేయండి. రెసిపీ ఇక్కడ ఇచ్చాం చూడండి.
మనకు ఉదయం చాలా హడావిడిగా ఉంటుంది. ఎన్నో పనులు చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ పనులకు శక్తి కావాలంటే ఉదయాన్నే పోషక విలువలతో కూడిన అల్పాహారం చేయడం తప్పనిసరి. మీరు సింపుల్ గా త్వరగా ఏదైనా అల్పాహారం చేయాలనుకుంటే మీకు శాండ్‌విచ్‌లు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి. శాండ్‌విచ్‌లు తయారు చేసుకోవటం చాలా ఈజీ, ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. ఇంట్లో ఉన్న రెండు బ్రెడ్ ముక్కలు తీసుకొని వాటి మధ్య కూరగాయలు, ప్రోటీన్ పదార్థాలు స్టఫ్ చేస్తే చాలు, శాండ్‌విచ్ రెడీ అయిపోతుంది.
శాండ్‌విచ్‌లలోనూ చాలా వెరైటీలు ఉంటాయి. వెజ్ శాండ్‌విచ్, గ్రిల్డ్ చికెన్ శాండ్‌విచ్, ఎగ్ శాండ్‌విచ్, ఆలూ గ్రిల్డ్ శాండ్‌విచ్, కార్న్ చీజ్ శాండ్‌విచ్, పనీర్ బుర్జీ శాండ్‌విచ్ ఇలా చాలానే ఉన్నాయి. అయితే మీరు ఎప్పుడైనా మష్రూమ్ చీజ్ శాండ్‌విచ్ తిన్నారా? మీకు మాంసాహారం వద్దనుకుంటే ఈ మష్రూమ్ చీజ్ శాండ్‌విచ్ మీకు మంచి ప్రత్యామ్నాయం. ఇది చాలా రుచికరంగా ఉంటుంది, పోషకాలు ఎక్కువే ఉంటాయి. దీనిని కేవలం 10 నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. మీరెప్పుడైనా త్వరగా బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేయాల్సి వస్తే తప్పకుండా మష్రూమ్ చీజ్ శాండ్‌విచ్ చేసేయండి, రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Mushroom Cheese Sandwich కోసం కావలసినవి
- బ్రౌన్ బ్రెడ్ యొక్క 2 ముక్కలు
- 1 కప్పు పుట్టగొడుగులు
- 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు
- 2 వెల్లుల్లి రెబ్బలు (తరిగినవి)
- 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి
- 1/2 కప్పు చెడ్డార్ చీజ్
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- కొద్దిగా వెన్న
- ఉప్పు రుచికి తగినట్లుగా
తయారీ విధానం
- ముందుగా బాణలిలో నూనె వేడి చేసి, అందులో పుట్టగొడుగులను వేసి కొన్ని సెకన్ల పాటు కదిలించాలి, ఆపై ఉల్లిపాయలు వేసి 4-5 నిమిషాలపాటు మష్రూమ్‌తో వేయించాలి.
- ఆపై వెల్లుల్లి, ఉప్పు కూడా వేసి 2-3 నిమిషాలు వేయించాలి.
- ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నల్ల మిరియాల పొడి వేసి, బాగా కలపండి. ఈ వేయించిన పుట్టగొడుగులను సుమారు 10 నిమిషాలు పక్కనబెట్టి చల్లబరచండి.
- అనంతరం 2 బ్రెడ్ స్లైస్‌లను తీసుకుని బటర్ రాసి పాన్‌పై రెండు వైపులా కాల్చండి. బంగారు రంగు వచ్చేవరకు రోస్ట్ చేసుకోవాలి.
- ఇప్పుడు రోస్ట్ చేసిన ఒక బ్రెడ్ స్లైస్‌పై చీజ్ (జున్ను) చల్లండి. ఆపై కొన్ని పుట్టగొడుగులను వేసి దానిపైన కూడా కొంచెం ఎక్కువ చీజ్ వేయండి, ఈ బ్రెడ్ స్లైస్‌ను మరొక స్లైస్‌తో కప్పండి.
అంతే మష్రూమ్ చీజ్ శాండ్‌విచ్ సిద్ధమైనట్లే. ఈ శాండ్‌విచ్‌ను రెండు భాగాలుగా కట్ చేసి సర్వ్ చేసుకోండి. టీ, కాఫీలు తీసుకుంటూ శాండ్‌విచ్ రుచిని ఆస్వాదించండి.
సంబంధిత కథనం