Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీలో మూడు భాషల్లో వస్తుందా? స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చంటే..
Tillu Square OTT Release: టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్లలో అదరగొడుతోంది. భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. అయితే, ఈ చిత్రం ఓటీటీలో తెలుగుతో పాటు మరో రెండు భాషల్లోనూ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
Tillu Square OTT: టిల్లు స్క్వేర్ సినిమాతో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.. బాక్సాఫీస్ మోతమోగించారు. రూ.100 కోట్ల క్లబ్‍లోకి చేరి భారీ బ్లాక్ బాస్టర్ కొట్టేశారు. మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ ఇంకా మంచి వసూళ్లను రాబడుతోంది. రెండేళ్ల కింద వచ్చిన డీజే టిల్లుకు సీక్వెల్‍గా వచ్చిన టిల్లు స్క్వేర్ భారీ అంచనాలను అందుకొని ప్రేక్షకులను మెప్పించింది. దీంతో మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి వసూళ్లు ఆ రేంజ్‍లో వస్తున్నాయి. అయితే, థియేటర్లలో తెలుగులో రిలీజైన టిల్లు స్క్వైర్ మూవీ.. ఓటీటీలోకి మాత్రం మరో రెండు భాషల్లోనూ అందుబాటులోకి వస్తుందని తాజాగా సమాచారం వెల్లడైంది.
మూడు బాషల్లో ఓటీటీలోకి..
టిల్లు స్క్వేర్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మంచి క్రేజ్ ఉండటంతో ఈ మూవీని మంచి ధరకే ఆ ఓటీటీ సొంతం చేసుకుంది. అయితే, టిల్లు స్క్వేర్ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం భాషల డబ్బింగ్ ఆడియోలోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి తీసుకురావాలని నెట్‍ఫ్లిక్స్ భావిస్తున్నట్టు సమాచారం బయటికి వచ్చింది.
స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రావొచ్చు?
టిల్లు స్క్వేర్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి ఏప్రిల్ నెలాఖరులో వస్తుందని ఇటీవల బజ్ నడిచింది. అయితే, థియేటర్లలో మంచి హిట్ కావడంతో స్ట్రీమింగ్ కాస్త ఆలస్యం కానుందని తెలుస్తోంది. మే 3వ తేదీ లేకపోతే మే నాలుగో వారంలోగా ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉందని తాజాగా అంచనాలు వెల్లడవుతున్నాయి.
టిల్లు స్క్వేర్ మూవీలో సిద్ధుకు జోడీగా హీరోయిన్‍గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. ఈ చిత్రం 9 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటేసింది. దీంతో ఈ సక్సెస్ మీట్‍ను కూడా ఇటీవలే మూవీ టీమ్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‍కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. యంగ్ హీరో విశ్వక్‍సేన్ కూడా వచ్చారు. సిద్దుపై ప్రశంసల వర్షం కురిపించారు ఎన్టీఆర్. అలాగే, తన దేవర సినిమా అభిమానులు కాలర్ ఎగిరేసేలా ఉంటుందని కూడా చెప్పారు.
టిల్లు స్క్వేర్ మూవీని సితార ఎంటర్‌టైన్‍మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో పాటలకు రామ్ మిర్యాల, అచ్చు రాజమణి ట్యూన్స్ ఇవ్వగా.. భీమ్స్ సిసిరోలియో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, ప్రిన్స్ సెసిల్, మురళీ శర్మ, ప్రణీత్ రెడ్డి కీలపాత్రలు చేయగా.. నేహా శెట్టి క్యామియో రోల్‍లో కనిపించారు.
టిల్లు స్క్వేర్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా మెచ్చుకున్నారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు మల్లిక్ రామ్, నిర్మాత నాగవంశీని ఇంటికి పిలుపించుకొని ప్రశంసించారు. తాను ఆ మూవీని చాలా ఎంజాయ్ చేశానని, సీక్వెల్‍పై పెట్టుకున్న అంచనాలను అందుకున్నారని మెగాస్టార్ అన్నారు. మరికొందరు సెలెబ్రిటీలు కూడా టిల్లు స్క్వేర్ గురించి సోషల్ మీడియాలో స్పందించారు. టిల్లు క్యూబ్ కూడా రానుందని మూవీ టీమ్ ఇప్పటికే వెల్లడించింది.