Jr NTR: ఓవర్ అనుకోకండి.. కాలర్ ఎగరేసేలా చేస్తాం: జూనియర్ ఎన్టీఆర్.. వంద పక్కన మరో సున్నా అన్న త్రివిక్రమ్
Jr NTR on Devera Movie: టిల్లు స్క్వేర్ మూవీ సక్సెస్ మీట్‍లో దేవర సినిమా గురించి చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. సినిమా ఆలస్యమవుతుండడంపై స్పందించారు.
Jr NTR: మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ హిట్ ఆర్ఆర్ఆర్ ఆయన చేస్తున్న ఈ చిత్రం కోసం నిరీక్షిస్తున్నారు. ఏప్రిల్‍లో రిలీజ్ కావాల్సిన దేవర సినిమా ఏకంగా అక్టోబర్ 10వ తేదీకి వాయిదా పడింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా స్పందించారు. నేడు (ఏప్రిల్ 8) జరిగిన టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్‍లో పాల్గొన్న ఎన్టీఆర్.. దేవర గురించి చెప్పారు.
కాలరే ఎగరేసేలా..
అభిమానులు గర్వంతో కాలర్ ఎగరేసేలా దేవర సినిమా ఉంటుందని ఎన్టీఆర్ చెప్పారు. ఓవర్ అయిందని అనుకోవద్దని అన్నారు. దేవర గురించి ఆయన మాట్లాడటంతో ప్రేక్షకులు హోరెత్తించారు.
దేవర రిలీజ్ ఆలస్యమైనా గర్వపడేలా ఉంటుందని ఎన్టీఆర్ చెప్పారు. “కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఓ విషయం చెబుతా. ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను. చొక్కాకు కాలర్ ఉంటుంది. దేవర అనే సినిమా రిలీజ్ లేటైనా సరే.. మీరందరూ కాలర్ ఎగరేసేలా ఆ చిత్రాన్ని మా ప్రేక్షక దేవుళ్లకు అందించేందుకు ప్రయత్నిస్తాం” అని ఎన్టీఆర్ అన్నారు.
దేవర నామసంవత్సరం
టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్‍కు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. దేవర నామసంవత్సరంగా ప్రకటిస్తున్నానని ఆయన అన్నారు. ఆ చిత్రం రూ.1,000 కోట్ల కలెక్షన్లు సాధించాలని ఆయన ఈ ఈవెంట్‍లో ఆకాంక్షించారు.
“వచ్చే సంవత్సరం రేపటి నుంచి (ఉగాది తెలుగు సంవత్సరం నుంచి) దీన్ని దేవర నామసంవత్సరంగా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే నాకు తెలిసి ఆయన (ఎన్టీఆర్) మీదే వెళ్లిపోయేలాగా ఉంది. వంద పక్కన ఇంకో సున్నా పెట్టి ఆయన దేవర మొదలుపెట్టాలని మనందరి తరఫున ఎన్టీఆర్‌ను ఆశీర్వదిస్తున్నా” అని త్రివిక్రమ్ చెప్పారు.
దేవర సినిమాను సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో గ్రాండ్ స్కేల్‍లో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. భారీ వీఎఫ్‍ఎక్స్, యాక్షన్ సీక్వెన్సులతో ఈ మూవీ ఉండనుంది. ఈ ఏడాది జనవరిలో వచ్చిన దేవర గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ యాక్షన్ అదిరిపోయింది. ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచేసింది.
దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. షైన్ టామ్ చాకో, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, నరైన్, కలైయారాసన్, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
టిల్లు స్క్వేర్ గురించి..
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ హీరోహీరోయిన్లుగా నటించిన కామెడీ థ్రిల్లర్ టిల్లు స్క్వేర్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం దుమ్మురేపుతోంది. 9 రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల కలెక్షన్ల మార్క్ దాటేసింది. దీంతో మూవీ టీమ్ నేడు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. డీజే టిల్లుకు సీక్వెల్‍గా వచ్చిన ఈ స్క్వేర్ అదరగొడుతోంది. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.
టిల్లు స్క్వేర్ చిత్రాన్ని సిద్ధు, విశ్వక్‍సేన్‍తో కలిసి ఇటీవల చూశారు ఎన్టీఆర్. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఈ సినిమా తనకు చాలా నచ్చటంతో సక్సెస్ మీట్‍కు కూడా వచ్చేశారు ఎన్టీఆర్.