ఆసియా కప్ 2023లో మొత్తం ఆరు టీమ్స్ బరిలోకి దిగుతున్నాయి. మాజీ, ప్రస్తుత ఛాంపియన్లు ఇండియా, పాకిస్థాన్, శ్రీలంకతోపాటు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ కూడా ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. వన్డే వరల్డ్ కప్ 2023కు అదే వన్డే ఫార్మాట్లో జరగనున్న టోర్నీ కావడంతో తమ జట్ల బలాబలాలను బేరీజు వేసుకోవడానికి ఈ ఆసియా కప్ 2023 అన్ని జట్లకు మంచి అవకాశంగా మారింది. ఒక్క నేపాల్ మినహా మిగిలిన ఐదు జట్లు వరల్డ్ కప్ లోనూ తలపడబోతున్నాయి. దీంతో ప్రతి జట్టూ వరల్డ్ కప్ కు ముందు తమ బలమైన తుది జట్టు ఏదో తేల్చుకునే వీలుంటుంది. పైగా వరల్డ్ కప్ కు ముందు ఆసియా కప్ గెలిస్తే ఆ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లూ తమకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్లేయర్స్ ను ఈ టోర్నీలో బరిలోకి దింపుతున్నాయి.
ఇండియాకు ఆసియా కప్ 2023లో చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇప్పటికే కొందరు కీలక ప్లేయర్స్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. వాళ్లలో ఎంతమంది వరల్డ్ కప్ సమయానికి పూర్తి ఫిట్ గా ఉంటారు? వాళ్లు ఎంత వరకూ రాణిస్తారన్నది తేల్చుకోవడానికి ఆసియా కప్ మంచి అవకాశం. పేస్ బౌలర్ బుమ్రా, స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్లు గాయాల నుంచి కోలుకుంటున్నారు. బుమ్రా ఇప్పటికే ఫిట్ నెస్ సాధించి ఐర్లాండ్ సిరీస్ కు కెప్టెన్ కూడా అయ్యాడు. మిగిలిన ఇద్దరు బ్యాటర్లు కూడా అందుబాటులోకి వస్తే టీమిండియా మరింత బలోపేతమవుతుంది.
ఇక వరల్డ్ కప్ కు ముందు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సెట్ చేసుకోవడానికి కూడా ఆసియా కప్ తోడ్పడుతుంది. రోహిత్, గిల్, కోహ్లిలకు తోడు మిడిలార్డర్ లో ఎవరు ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది. రాహుల్, శ్రేయస్ వస్తే మిడిలార్డర్ చాలా పటిష్ఠంగా మారుతుంది. లేదంటే వన్డేల్లో అంతగా ప్రభావం చూపించలేకపోతున్న సూర్యకుమార్ తోపాటు సంజూ శాంసన్ లకు అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఇక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లోనూ ఓ చేయి వేస్తుండటం ఇండియాకు కలిసి వచ్చేదే.
ఆసియా కప్ 2023లో ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, నేపాల్ పాల్గొంటున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఈ దేశాలు తమ జట్లను ఇంకా ప్రకటించలేదు.
ఆసియా కప్ 2023లో ఇండియా టీమ్ లో ఎవరున్నారు?
ఆసియా కప్ 2023 కోసం ఇండియా ఇంకా జట్టును ప్రకటించలేదు.
ఆసియా కప్ 2023లో బుమ్రా, రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఆడతారా?
బుమ్రా ఇప్పటికే ఫిట్‌నెస్ సాధించాడు. ఐర్లాండ్ సిరీస్ లో కెప్టెన్ కూడా అయ్యాడు. అయితే రాహుల్, శ్రేయస్ ఇంకా గాయాల నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో వాళ్లు ఆసియా కప్ 2023 సమయానికి అందుబాటులోకి వస్తారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేము.