Rohit Sharma: సిరాజ్ ఇంకా బౌలింగ్ చేయాలనుకున్నాడు.. కానీ: రోహిత్ శర్మ
Rohit Sharma: ఆసియాకప్ ఫైనల్‍లో శ్రీలంకను కుప్పకూల్చాడు భారత పేసర్ సిరాజ్. ఆరు వికెట్లతో సత్తాచాటాడు. అయితే, అతడు 7 ఓవర్లు మాత్రమే వేసినా.. ఆ తర్వాత బౌలింగ్ ఇవ్వలేదు కెప్టెన్ రోహిత్. అలా ఎందుకు చేశాడో సమాధానం చెప్పాడు.
Rohit Sharma: ఆసియాకప్ 2023 ఫైనల్‍లో భారత పేసర్, హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఆరు వికెట్లు తీసి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతడి విజృంభణతో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‍లో లంక 50 పరుగులకే ఆలౌట్ కాగా.. 6.1 ఓవర్లలోనే 10 వికెట్ల తేడాతో టార్గెట్‍ను ఛేదించింది భారత్. సిరాజ్ మొత్తంగా 7 ఓవర్లు వేసి 6 వికెట్లు తీశాడు. అయితే, ఆ తర్వాత సిరాజ్‍కు బౌలింగ్ ఇవ్వలేదు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఒకవేళ సిరాజ్ తన కోటాలోని ఆ మూడు ఓవర్లు కూడా వేసినట్టయితే ఆ ఊపు మీద మరిన్ని వికెట్లు తీసుకునే వాడని, తద్వారా మరిన్ని రికార్డును బద్దలుకొట్టే వాడని వాదనలు వినిపించాయి. అయితే, సిరాజ్‍కు ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదో కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు.
ఆసియాకప్ ఫైనల్‍లో గెలిచాక మీడియా సమావేశంలో మాట్లాడాడు రోహిత్ శర్మ. 7 ఓవర్లు వేసిన సిరాజ్‍కు ఆ తర్వాత ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదో కూడా హిట్‍మ్యాన్ చెప్పాడు. "ఒకే స్పెల్‍లో సిరాజ్ 7 ఓవర్లు వేశాడు. అది చాలా ఎక్కువ. అప్పుడు సిరాజ్‍ను ఆపాలని మా ట్రైనర్ నుంచి మెసేజ్ వచ్చింది. సిరాజ్ బౌలింగ్ చేయాలని చాలా తహతహలాడాడు. ఏ బౌలర్, బ్యాటర్‌కైనా అలా ఉండడం సహజం. అప్పుడే నేను బాధ్యత నిర్వర్తించాలి” అని రోహిత్ చెప్పాడు. ఒకే స్పెల్‍లో పేసర్ 7 ఓవర్లు వేయడం కాస్త ఎక్కువే. అతడిని వరుసగా అలాగే బౌలింగ్ చేయిస్తే అలసిపోయి శరీరంపై ఒత్తిడి అధికమై గాయమయ్యే రిస్క్ కూడా పెరుగుతుంది. అందుకే ట్రైనర్స్ నుంచి సిరాజ్‍ను బౌలింగ్ వేయకుండా ఆపాలనేలా సందేశం వచ్చిందని రోహిత్ వివరించాడు.
అలాగే, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గెలిచిన భారత స్పిన్నర్ కుల్‍దీప్ యాదవ్‍పై ప్రశంసలు కురిపించాడు రోహిత్ శర్మ. “ఒత్తిడిలో కుల్‍దీప్ అద్భుతంగా రాణించాడు. శ్రీలంకతో (సూపర్ 4 మ్యాచ్)లో బాగా బౌలింగ్ చేశాడు. దీంతో చిన్న టార్గెట్‍ను కాపాడుకొని మేం గెలిచాం. రెండేళ్ల నుంచి అతడి ఆత్మవిశ్వాసం పెరుగుతూనే ఉంది” అని రోహిత్ శర్మ చెప్పాడు.
కాగా, ఆదివారం జరిగిన ఆసియాకప్ ఫైనల్‍లో శ్రీలంకపై టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 8వసారి ఆసియాకప్ టైటిల్‍ను కైవసం చేసుకుంది. ఓ వన్డే మ్యాచ్‍లో అత్యధిక వేగంగా (16 బంతుల్లో) 5 వికెట్లను పడగొట్టిన అంతర్జాతీయ రికార్డును (చమింద వాస్) సిరాజ్ సమం చేశాడు. వన్డేలో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా సిరాజ్ చరిత్ర సృష్టించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సిరాజ్.. తన రూ.4లక్షల క్యాష్ ప్రైజ్‍ను గ్రౌండ్స్ మెన్‍కు ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు.