Virat Kohli: 'ఇషాన్ నీ వల్ల కాదు': ఇమిటేట్ చేసేందుకు ట్రై చేసిన కిషన్‍కు కోహ్లీ పంచ్.. ఫన్నీ వీడియో
Virat Kohli: విరాట్ కోహ్లీ నడకను ఇమిటేట్ చేసేందుకు ఇషాన్ కిషన్ ప్రయత్నించాడు. అయితే, కిషన్ నడకను కోహ్లీ అంగీకరించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను సృష్టించాడు. ఇంకా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా.. అతడిని చాలా మంది దిగ్గజంగా భావిస్తారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‍లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ వరుసలో కోహ్లీ ముందుంటాడు. అయితే, తాను ఆ స్థాయికి ఎదిగినా భారత జట్టులోని యువ ఆటగాళ్లతో కూడా చాలా సరదాగా ఉంటాడు కోహ్లీ. కొన్నిసార్లు ఆట పట్టిస్తాడు. తాజాగా, ఆసియాకప్ 2023 ఫైనల్‍లో శ్రీలంకపై విజయం సాధించి టైటిల్‍ను టీమిండియా గెలిచాక ఇలాంటిదే ఓ ఫన్నీ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
శ్రీలంకతో ఆదివారం జరిగిన ఆసియాకప్ ఫైనల్ 2023లో గెలిచాక టీమిండియా ప్లేయర్లు కొలంబో మైదానంలో సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సరదాగా జోకులు వేసుకుంటున్నారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ ఎలా నడుస్తాడో తాను చూపిస్తానంటూ ఇషాన్ కిషన్ ముందుకు వచ్చాడు. కోహ్లీ నడకను ఇమిటేట్ చేస్తూ నడిచాడు. అయితే, ఇషాన్ తనలా సరిగా నడవలేకున్నాడని కోహ్లీ అన్నాడు. తనలా నడవడం అతడికి రావడం లేదని విరాట్ అన్నాడు.
అలాగే, బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍లో తాను డ్రింక్స్ తీసుకొచ్చిన సమయంలో ఎలా నడిచానో కూడా కోహ్లీ చేసి చూపించాడు. కాగా, మరోసారి చేస్తానంటూ.. కోహ్లీ వాక్‍ను మళ్లీ ఇమిటేట్ చేశాడు ఇషాన్. దీంతో తలతిప్పుతూ విచిత్రంగా నడుస్తున్నాడని, తన నడకను ఇషాన్ ఇమిటేట్ చేయడం కిషన్ వల్ల కావడం లేదని సహచర ఆటగాళ్లతో కోహ్లీ సరదాగా అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. కోహ్లీ సరదాగా ఉండడాన్ని చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఫన్నీ వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కొలంబో వేదికగా జరిగిన ఆసియాకప్ ఫైనల్ 2023లో శ్రీలంకను టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓడించింది. భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లతో చెలరేగటంతో శ్రీలంక 50 పరుగులకే ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని టీమిండియా వికెట్ కోల్పోకుండా 37 బంతుల్లోనే ఛేదించేసింది. 8వసారి ఆసియాకప్ టైటిల్‍ను భారత్ కైవసం చేసుకుంది.