Shaheen Afridi Marriage: షాహిద్ అఫ్రిది కూతురిని పెళ్లి చేసుకున్న షహీన్ అఫ్రిది.. స్పెషల్ హగ్ ఇచ్చిన బాబర్ ఆజం
Shaheen Afridi Marriage: షాహిద్ అఫ్రిది కూతురిని పెళ్లి చేసుకున్నాడు పాకిస్థాన్ పేస్ బౌలర్ షహీన్ అఫ్రిది. వీళ్ల పెళ్లికి వచ్చిన పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం.. అతనికి స్పెషల్ హగ్ ఇచ్చాడు.
Shaheen Afridi Marriage: పాకిస్థాన్ స్టార్ పేస్ బౌలర్ షహీన్ అఫ్రిది ఓ ఇంటివాడయ్యాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూతురు అన్షాను షహీన్ పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా వీళ్ల పెళ్లికి వచ్చాడు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం. అంతేకాదు మామాఅల్లుళ్లకు ఓ స్పెషల్ హగ్ కూడా ఇచ్చాడు. దీంతో తనకు, షహీన్ కు మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు.
ఆసియా కప్ 2023 ముగియగానే షహీన్ షా అఫ్రిది పెళ్లి చేసుకున్నాడు. అతని పెళ్లి ఘనంగా జరిగింది. పాకిస్థాన్ టీమ్ సభ్యులంతా అఫ్రిది పెళ్లికి వచ్చారు. మామాఅల్లుళ్లు ఇద్దరూ స్టార్ క్రికెటర్లు కావడంతో పాకిస్థాన్ క్రికెట్ పెద్దలంతా అక్కడే ఉన్నారు. ఇక వీళ్లలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అతడు కారు దిగినప్పటి నుంచీ తిరిగి వెళ్లే వరకూ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
ముఖ్యంగా ఆసియా కప్ తర్వాత షహీన్ అఫ్రిది, బాబర్ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యత లభించింది. పెళ్లికి వచ్చిన బాబర్ ను మొదట షాహిద్ అఫ్రిది గట్టిగా హగ్ చేసుకొని స్వాగతం పలికాడు. ఆ తర్వాత స్టేజ్ పై ఉన్న షహీన్ అఫ్రిది దగ్గరికి వెళ్లి బాబర్ స్పెషల్ హగ్ ఇచ్చాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని ఫొటోలకు పోజులిచ్చారు.
ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఆసియా కప్ సూపర్ 4 స్టేజ్ లోనే పాకిస్థాన్ ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. శ్రీలంక చేతుల్లో సెమీఫైనల్ లాంటి మ్యాచ్ లో ఓడిపోవడంతో ఫైనల్ చేరలేకపోయింది. దీంతో మ్యాచ్ తర్వాత బాబర్ డ్రెస్సింగ్ రూమ్ లో మాట్లాడుతూ.. ప్లేయర్స్ అందరూ కాస్త బాధ్యతాయుతంగా ఆడాలని అన్నట్లు వార్తలు వచ్చాయి.
దీనిపై షహీన్ స్పందిస్తూ.. కనీసం బాగా ఆడినవాళ్లనైనా అభినందించు అని అన్నాడు. ఎవరు ఆడుతున్నారో ఎవరు ఆడటం లేదో నాకు తెలుసని బాబర్ అనడంతో గొడవ ముదిరింది. ఈ సమయంలో వికెట్ కీపర్ రిజ్వాన్ జోక్యం చేసుకోవడంతో అది అంతటితో సద్దుమణిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాబర్ ఇలా షహీన్ పెళ్లికి రావడం, అతన్ని హగ్ చేసుకొని శుభాకాంక్షలు చెప్పడంతో విభేదాలకు చెక్ పెట్టినట్లయింది.