ఆసియా కప్ 2023 ఆగస్ట్ 30న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ఈసారి పాకిస్థాన్ టోర్నీకి ఆతిథ్యమివ్వాల్సి ఉన్నా.. బీసీసీఐ అక్కడికి భారత జట్టును పంపడానికి నిరాకరించడంతో ఇండియా ఆడబోయే మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. కేవలం 4 మ్యాచ్‌లు పాకిస్థాన్ లో, మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి. శ్రీలంకలోని క్యాండీలో నాలుగు మ్యాచ్ లు, కొలంబోలో 9 మ్యాచ్ లు జరుగుతాయి. సెప్టెంబర్ 2న ఇండియా, పాకిస్థాన్ మధ్య లీగ్ మ్యాచ్ క్యాండీలో జరగనుంది. ఇక సూపర్ 4లోనూ సెప్టెంబర్ 10న ఇండియా, పాకిస్థాన్ మధ్య మరో మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రెండు జట్లు ఫైనల్ చేరితే మొత్తం మూడుసార్లు ఆసియా కప్ లో ఇండియా, పాకిస్థాన్ తలపడతాయి. మొదట ఆసియా కప్‌ను మొత్తంగా పాకిస్థాన్ నుంచి తరలించాలని బీసీసీఐ డిమాండ్ చేసినా.. హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదనను ఏసీసీ అంగీకరించింది. దీంతో పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా టోర్నీ నిర్వహిస్తున్నాయి. ఆసియాక కప్ 2023లో ఇండియా, పాకిస్థాన్, నేపాల్ గ్రూప్ ఎలో.. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్ బిలో ఉన్నాయి. నేపాల్ తొలిసారి ఆసియా కప్ లో తలపడబోతోంది. ఇప్పటి వరకూ మొత్తం 15 ఆసియా కప్ టోర్నీలు జరగగా.. ఇండియా అత్యధికంగా ఏడుసార్లు, శ్రీలంక ఆరుసార్లు, పాకిస్థాన్ రెండుసార్లు టైటిల్ గెలిచాయి. 2022లో చివరిసారి టీ20 ఫార్మాట్ లో జరిగిన ఆసియా కప్‌లో శ్రీలంక విజేతగా నిలిచింది. ఈసారి టోర్నీ వన్డే ఫార్మాట్లో జరగబోతోంది.
ఆసియా కప్ తొలిసారి 1984లో జరిగింది. ఆ టోర్నీలో ఇండియా విజేతగా నిలిచింది. అంతకుముందు ఏడాదే వరల్డ్ కప్ గెలిచి ఊపు మీదున్న ఇండియా.. ఆసియా కప్ కూడా గెలిచి ఆధిపత్యాన్ని కొనసాగించింది. 1984 నుంచి 1995 వరకూ ప్రతి ఆసియా కప్‌లోనూ ఇండియా ఫైనల్ చేరింది. 1984 నుంచి 2022 మధ్య మొత్తం 15 ఆసియా కప్ టోర్నీలు జరిగాయి. అందులో ఇండియా ఏడు టైటిల్స్ తో ఆసియా కింగ్ తానే అని నిరూపించుకుంది. తర్వాతి స్థానంలో శ్రీలంక ఆరు టైటిల్స్ తో ఉంది. 1992లో వరల్డ్ కప్ గెలిచిన పాకిస్థాన్.. ఆసియా కప్ లో మాత్రం పెద్దగా రాణించలేకపోయింది. ఆ టీమ్ కేవలం రెండు టైటిల్స్ మాత్రమే గెలిచింది. 2000, 2012లలో పాక్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇక ఇండియా విషయానికి వస్తే 1984తోపాటు 1988, 1990, 1995, 2010, 2016, 2018లలో టైటిల్స్ సొంతం చేసుకుంది. శ్రీలంక 1986, 1997, 2004, 2008, 2014, 2022లలో విజయం సాధించింది. బంగ్లాదేశ్ మూడుసార్లు అంటే 2012, 2016, 2018లలో ఫైనల్స్ చేరినా.. టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. 2016, 2022లో రెండుసార్లు మాత్రమే ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరిగింది. తొలిసారి ఇండియా, రెండోసారి శ్రీలంక విజేతగా నిలిచాయి. ఇక 1984 నుంచి 2022 వరకూ ప్రతి ఆసియా కప్ లో ఆడిన ఏకైక జట్టుగా శ్రీలంక రికార్డు క్రియేట్ చేసింది. 1986లో ఇండియా, 1990లో పాకిస్థాన్ ఈ టోర్నీలో ఆడలేదు. ఇక బంగ్లాదేశ్ టీమ్ 1986 నుంచి టోర్నీలో ఆడుతోంది. 2023 ఆసియా కప్ లో తొలిసారి నేపాల్ ఆడుతోంది. ఈసారి టోర్నీ లైవ్ స్టార్ స్పోర్ట్స్ లో రానుంది. ఆసియా కప్ 2023లో మొత్తం 13 మ్యాచ్ లు పాకిస్థాన్, శ్రీలంకలలో జరుగుతాయి.
ఆసియా కప్ 2023.. ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది
ఆసియా కప్ 2023 ఎక్కడ జరుగుతోంది?
ఆసియా కప్ 2023 పాకిస్థాన్, శ్రీలంకలలో జరగనుంది. మొత్తం 13 మ్యాచ్ లలో 4 పాకిస్థాన్ లో, 9 శ్రీలంకలో జరుగుతాయి. ఇండియా ఆడే మ్యాచ్‌లు అన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి.
ఆసియా కప్ 2023లో ఫేవరెట్ ఎవరు?
ఆసియా కప్ 2023లో ఫేవరెట్ ఎవరు అన్నది చెప్పడం కష్టం. అయితే ఈ టోర్నీని ఇప్పటి వరకూ 7 సార్లు గెలుచుకున్న ఇండియాకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో పాకిస్థాన్, గతేడాది అండర్ డాగ్ గా బరిలోకి దిగి టైటిల్ గెలిచిన శ్రీలంకలను కూడా తక్కువ అంచనా వేయలేం.
ఆసియా కప్ 2023 ఏ ఫార్మాట్‌లో జరుగుతుంది?
ఆసియా కప్ 2023 వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. గతేడాది టీ20 వరల్డ్ కప్ ఉన్నందున టీ20 ఫార్మాట్‌లో నిర్వహించినా.. ఈసారి మళ్లీ వన్డే ఫార్మాట్‌లోనే నిర్వహిస్తున్నారు.