Shubman Gill Rank: బాబర్ నంబర్ వన్ ర్యాంక్‌పై కన్నేసిన శుభ్‌మన్ గిల్.. ఆస్ట్రేలియాపై ఇలా చేస్తే సొంతం
Shubman Gill Rank: బాబర్ నంబర్ వన్ ర్యాంక్‌పై కన్నేశాడు శుభ్‌మన్ గిల్. అయితే రానున్న ఆస్ట్రేలియా సిరీస్ లోనే అతడు ఈ ర్యాంక్ అందుకునే అవకాశం ఉంది. దీనికోసం అతడు ఏం చేయాలంటే..
Shubman Gill Rank: టీమిండియా స్టార్ బ్యాటర్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్ కు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం ఈ స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ లోనే గిల్ అతన్ని వెనక్కి నెట్టి టాప్ లోకి దూసుకెళ్లే అవకాశం కూడా ఉంది.
ఆసియా కప్ 2023లో 302 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన గిల్.. తాజా వన్డే ర్యాంకుల్లో రెండోస్థానంలో నిలిచాడు. 814 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉన్న గిల్.. తొలి స్థానంలో ఉన్న బాబర్ ఆజం (857) కంటే 13 పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. ఈ గ్యాప్ ను అధిగమించాలంటే గిల్ ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ లో 200 పరుగులు చేయాల్సి ఉంటుంది.
ఈ నెల 22 నుంచి ప్రారంభం కాబోతున్న సిరీస్ లో గిల్ నంబర్ వన్ అందుకోవాలంటే బాగానే శ్రమించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా జట్టుపై మూడు వన్డేల్లోనే 200 రన్స్ చేయడం మామూలు విషయం కాదు. ఆసియా కప్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో జట్టు ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించిన గిల్.. ఆస్ట్రేలియాపైనా అదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేయాలని భావిస్తున్నాడు.
ఆస్ట్రేలియాతో శుక్రవారం (సెప్టెంబర్ 22) తొలి వన్డే మొహాలీలో జరగనుంది. ఈ మ్యాచ్ తోపాటు రెండో వన్డే కోసం కూడా సెలక్టర్లు కొందరు కీలకమైన ప్లేయర్స్ కు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. రోహిత్, విరాట్, హార్దిక్, కుల్దీప్ లాంటి ప్లేయర్స్ ఈ రెండు వన్డేలకు అందుబాటులో ఉండరు. కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉంటాడు. మూడో వన్డేకు వీళ్లంతా తిరిగి వస్తారు.
సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఇక అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఈ సిరీస్ తోపాటు వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా టీమ్ బుధవారమే (సెప్టెంబర్ 20) ఇండియాలో అడుగుపెట్టింది. అక్టోబర్ 8న చెన్నైలో వరల్డ్ కప్ లో భాగంగా ఈ రెండు టీమ్స్ తలపడనున్నాయి. టోర్నీలో ఇండియాకు అదే తొలి మ్యాచ్.