South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు-southwest monsoon reached andaman says imd pre monsoon depression in bay of bengal ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Bandaru Satyaprasad HT Telugu
May 19, 2024 03:54 PM IST

South West Monsoon : నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకినట్లు ఐఎండీ ప్రకటించింది. ఈ ఏడాది ప్రీ మాన్ సూన్ సీజన్ లో తొలి అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, ఐఎండీ కీలక అప్డేట్
అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, ఐఎండీ కీలక అప్డేట్

South West Monsoon : నైరుతి రుతుపవనాల గమనంపై భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకినట్లు ప్రకటించింది. రుతుపవనాలు ప్రస్తుతానికి మాల్దీవులు, కొమోరిన్‌, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించాయని పేర్కొంది. ఈ ఏడాది ప్రీ మాన్‌సూన్‌ సీజన్‌లో తొలి అల్పపీడనం ఏర్పడనుంది ప్రకటించింది. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటున సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ, యానాంలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీలో వర్షాలు

ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆదివారం మధ్యా్హ్నాం ఉత్తర కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతమై ఉంది.

మే 22 నుంచి 27 వరకు బలమైన తుపాను ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ నుంచి వైజాగ్ - పూరి వరకు కోస్తా తీరంపై తుపాన్ ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో మే 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మే 24 నాటికి వాయుగుండం మారే అవకాశం ఉందన్నారు. వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్నారు.

తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకాయని, ఇవాళ మాల్దీవులుు, కోమరిన్‌ ప్రాంతంలో కొంతమేర, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్‌ దీవులు, దక్షిణ అండమాన్‌ సముద్రంలోని కొంత మేర విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ లో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.

Whats_app_banner

సంబంధిత కథనం