Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్
Warangal Rains: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రానికే వాతావరణం చల్లబడగా.. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో భారీ వర్షం మొదలైంది.
Warangal Rains: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రానికే వాతావరణం చల్లబడగా.. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో భారీ వర్షం మొదలైంది.
ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడగా, అకాల వర్షానికి చాలా చోట్లా వడ్లు తడిసి పోయాయి. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండటంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇదిలావుంటే ఈదురుగాలుల ప్రభావానికి చాలాచోట్లా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో జనాలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక గ్రేటర్ వరంగల్ లో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. గత పరిస్థితుల దృష్ట్యా జనాలకు సమస్యలు ఎదురవకుండా చర్యలు చేపట్టారు. బల్దియాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అవసరమైన చోట సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్స్ అందుబాటులోకి తెచ్చారు.
గ్రేటర్ లో అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ
అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయం అందించడానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు అధికారులు, సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే తెలిపారు.
నగరంలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే ప్రజలు వెంటనే 1800 425 1980 ప్రత్యేక టోల్ ఫ్రీ, 97019 99645 మొబైల్, 97019 99676 వాట్సప్ నంబర్ లను సద్వినియోగించుకొని సమస్యను తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమస్యకు సంబంధించిన ఫోటో లను వాట్సాప్ నెంబర్ కు పంపి, ఆ ప్రాంతం ఏ డివిజన్ లోని ప్రాంతంలో ఉందో కూడా తెలియజేస్తే బల్దియా డిఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు, ఇతర స్టాఫ్ తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే స్పష్టం చేశారు.
కరెంట్ కోతలతో ఇబ్బందులు
ఈదురుగాలుల వానల నేపథ్యంలో జనం కరెంట్ కోతలతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గాలి వానకు కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు కరెంట్ స్తంభాలపై పడగా.. విద్యుత్తు సరఫరా కు అంతరాయం కలిగింది. ఉమ్మడి వరంగల్ లోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.
ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గార్ల, కేసముద్రం, నెల్లికుదురు, కొత్తగూడ, గంగారం, మహబూబాబాద్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో కొన్ని గ్రామాలు అంధకారంలో మగ్గాల్సి వచ్చింది. ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఆందోళనలో అన్నదాతలు
గత కొద్దిరోజులుగా అకాల వర్షాలు ఆగం చేస్తుండగా ఇప్పటికే చాలాచోట్లా పంట నష్టం జరిగింది. కల్లాల్లో వడ్లు తడిసి ముద్దవగా, కొంతమంది రైతులు తీవ్రంగా నష్టపయారు. ఇప్పుడు గురువారం రాత్రి కురిసిన వర్షం కుడా అదే తీరుగా అన్నదాతలను దెబ్బ తీసింది.
వడ్లు తడిసిపోవడంతో రైతన్నలు వాటిని కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మరో ఐదు రోజులు రాష్ట్రంలో భారీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఓ వైపు, అకాల వర్షాలు మరో వైపు రైతన్నలను కుదిపేస్తుండగా.. మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని రైతుల్లో భయాందోళన వ్యక్తం అవుతోంది.
ఈ నేపథ్యంలోనే కోనుగోలు ప్రక్రియను స్పీడప్ చేయడంతో పాటు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కండీషన్లు లేకుండా కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం