Karimnagar Rains : అకాల వర్షాలు, తడిసిపోయిన ధాన్యం..! అన్నదాత ఆగమాగం
Rains in Karimnagar District : అకాల వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మేందుకు సిద్దంగా ఉంచిన ధాన్యం మొత్తం తడిసిపోవటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Rains in Karimnagar District : అల్పఫీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది.
చేతికందిన పంటను అరబెట్టి అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో సిద్దంగా ఉంచిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. పలు చోట్ల వరదకు ధాన్యం కొట్టుకుపోయి రైతన్నలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు.
పెద్దపల్లి జిల్లా మంథని, కమాన్ పూర్, ముత్తారం, రామగిరి మండలాల భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో కల్లాల్లోని ధాన్యం తడిసిపోయి రైతన్నలు తల్లడిల్లుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం కావడంతో రైతన్నలు కన్నీటిపర్యంతమయ్యారు.
రైతన్నల ఆవేదన….
సకాలంలో కొనుగోలు జరిగితే ధాన్యం తడిసిపోయేదికాదని రైతన్నలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. మంథని వ్యవసాయ మార్కెట్లో దాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరగడం వల్లే ధాన్యం తడిసిపోయిందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. తరుగు తాలు, తేమ, నాణ్యత పేరుతో ఐకేపి, సహకార సంఘాలు దాన్యం కొనుగోలులో కొర్రిలు పెడుతు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గింజను తరుగు లేకుండా ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
రోడ్డెక్కిన అన్నదాతలు...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తు అన్నదాతలు ఆందోళనకు దిగారు. కొనరావుపేట మండలంలో దాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారని పలు చోట్ల రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నా రాస్తారోకో చేశారు. అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే అధికారులు సకాలంలో కొనుగోలు చేయకుండా తీవ్ర నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా, అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మరో నాలుగు రోజులు వర్షాలు..
అల్పఫీడన ప్రభావంతో మరో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మార్కెట్ యార్డుల్లో ఐకేపి, సహకార సంఘాల కేంద్రాల్లో ధాన్యం వర్షానికి తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన టార్పానిలు అందుబాటులో ఉంచామని తెలిపారు.
అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. తేమ, నాణ్యత లేకపోవడంతోనే కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు చేయడం లేదని దాన్ని బూచిగా చూపి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించడం భావ్యం కాదన్నారు రాజన్నసిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లా అదికారులు.
నాణ్యత గల ధాన్యం తేమ 17 శాతం ఉన్న ధాన్యం ను సకాలంలో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతులు ఆందోళన చెందకుండా ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకుని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని కోరారు.
రిపోర్టింగ్ - HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR
సంబంధిత కథనం