Karimnagar News : రైతులకు నష్టం జరగనివ్వం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం- పౌరసరఫరాల శాఖ కమిషనర్-karimnagar civil supplies commissioner say every single wet paddy procurement from farmers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar News : రైతులకు నష్టం జరగనివ్వం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం- పౌరసరఫరాల శాఖ కమిషనర్

Karimnagar News : రైతులకు నష్టం జరగనివ్వం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం- పౌరసరఫరాల శాఖ కమిషనర్

HT Telugu Desk HT Telugu
May 08, 2024 10:15 PM IST

Karimnagar News : అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని చూసి అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. దీంతో రైతులకు భరోసా కల్పించేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు భరోసా కల్పించారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు.

పౌరసరఫరాల శాఖ కమిషనర్
పౌరసరఫరాల శాఖ కమిషనర్

Karimnagar News : అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మధుర నగర్ లోని ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఎస్ చౌహాన్ సందర్శించి పరిశీలించారు. ధాన్యం తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించి రైతులకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు ఎన్ని క్వింటాల్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంకా ఎన్ని క్వింటాల్ల ధాన్యం రానుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులను ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అంటు అడిగి తెలుసుకున్నారు. రైతులకు మనోధైర్యం, భరోసా కల్పించేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించానని తెలిపారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు. ప్రభుత్వ పరంగా ఎన్ని ఇబ్బందులు అయినా తాము భరిస్తామని, రైతులకు మాత్రం కష్టం రాకుండా చూస్తామని స్పష్టం చేశారు.

తరుగు పేరిట కోత విధిస్తే కఠిన చర్యలు

తరుగు పేరిట ధాన్యంలో కోత విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్ చౌహాన్ హెచ్చరించారు. ఒక గ్రాము ధాన్యమైనా కోత విధించే అధికారం మిల్లర్లతో పాటు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో అధికారులతో సమావేశం నిర్వహించి రైతులు ఇబ్బందులు పడకుండా చూస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పలు అంశాలపై మాట్లాడానని చెప్పారు. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వారం రోజుల పాటు అధికారులు అంతా అలర్ట్ గా ఉండాలని, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మండలాల వారీగా ప్రతిరోజు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని పేర్కొన్నారు. తేమశాతం సరిగ్గా వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. మిల్లర్లకు సమాచారం ఇచ్చి ధాన్యాన్ని తూకం వేయాలన్నారు. ఆ తర్వాత తూకం వేసిన ధాన్యం తడిసినా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని భరోసా కల్పించారు. ధాన్యం బాయిల్డ్ రైస్ కు ఉపయోగపడుతుందని, మిల్లర్లకు సైతం ఎలాంటి నష్టం కలగదని చెప్పారు. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ధాన్యాన్ని క్లీన్ చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని, తద్వారా మంచి మద్దతు ధర వస్తుందని పేర్కొన్నారు. అధికారులు ప్యాడీ క్లీనర్ లను అందుబాటులో ఉంచాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం తగిన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీడ వసతి, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలను తరచూ జిల్లా స్థాయి అధికారులు సందర్శించాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

రైతుల మొబైల్ నెంబర్ నమోదు చేయాలి

కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చే ప్రతి రైతుకు సంబంధించిన సెల్ నంబర్ ను రిజిస్టర్ లో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు డీఎస్ చౌహాన్ ఆదేశించారు. ఈ విధానాన్ని సిబ్బంది విధిగా పాటించాలని పేర్కొన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫోన్లో నేరుగా మాట్లాడే ఛాన్స్ ఉంటుందని వివరించారు. పలువురు రైతులతో డీఎస్ చౌహాన్ స్వయంగా మాట్లాడారు. ధాన్యం అమ్ముకోవడంలో డబ్బులు చెల్లించడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ధాన్యం విక్రయించిన తర్వాత ఎన్నిరోజులకు డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయని తెలుసుకోగా మూడు నాలుగు రోజుల్లో డబ్బులు వస్తున్నాయని రైతులు తెలిపారు. డీఎస్ చౌహాన్ వెంట అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, సివిల్ సప్లైస్ డీఎం రజినీకాంత్, ఇన్చార్జి డీఎస్ఓ సురేష్ రెడ్డి, మార్కెటింగ్ అధికారి పద్మావతి, డీసీఓ రామానుజ చార్య, డీఆర్డీఓ శ్రీధర్, గంగాధర ఏడీఏ రామారావు పలువురు అధికారులు ఉన్నారు.

HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR

Whats_app_banner

సంబంధిత కథనం