MSP For Wet Paddy : తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు-khammam minister tummala nageswara rao says wet paddy buying for msp ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Msp For Wet Paddy : తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

MSP For Wet Paddy : తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Bandaru Satyaprasad HT Telugu
May 08, 2024 04:17 PM IST

MSP For Wet Paddy : తెలంగాణలో గత రెండ్రోజుగా కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. అయితే దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని ప్రకటించింది.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

MSP For Wet Paddy : తెలంగాణలో అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. మామిడి, మొక్కజొన్న, కూరగాయల పంటలు స్వల్పంగా నష్టపోయాయి. అయితే పంట నష్టంపై రైతులు అధైర్యపడొద్దని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతన్నలకు అండగా ఉంటుందన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా కింద అర్హులైన రైతులకు రూ.15 వేలు ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.

అకాల వర్షాలతో పంట నష్టం

గత రెండు రోజులుగా తెలంగాణలో కురిసిన అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు సెంటర్లలో పోసిన వరి ధాన్యం సైతం తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు తడిసిపోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం స్పందిస్తూ తడిచిన ధాన్యం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని తెలిపింది.

మే 13 తర్వాత రైతు భరోసా జమ

రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వం రూ.10 వేలు అందించేది. అయితే ఎన్నికల్లో హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15 వేలు పెట్టుబడి సాయంగా రైతు భరోసా అందిస్తామని చెప్పింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పాత పద్దతిలోనే రైతు భరోసా నిధులు జమ చేస్తుంది. ఇప్పటి వరకూ 5 ఎకరాల లోపు వారిని నగదు జమ చేయగా...తాజాగా 5 ఎకరాల ఉన్న వారికి రైతు భరోసా నిధుల విడుదల ఈసీ అనుమతి కోరింది ప్రభుత్వం. అయితే ముందు నిధుల విడుదలకు అనుమతి ఇచ్చిన ఈసీ... సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని, మే 13 తర్వాత రైతు భరోసా నిధులు జమ చేయాలని ఆదేశించింది.

అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా

రైతు భరోసా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేసారు. అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నగదును ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బంజరు భూములు, విదేశాల్లో ఉన్నవారికి రూ.లక్షల నగదు జమ చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులైన రైతులకు, వ్యవసాయ భూములకే రైతు భరోసా ఇస్తుందని, ఆ మేరకు విధివిధానాలు రూపొందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

మంగళవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వర్షాల ధాటికి అతలాకుతలం అయ్యాయి. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. చాలా జిల్లాల్లో పంట నష్టం వాటిల్లింది.

Whats_app_banner

సంబంధిత కథనం