Pawan Kalyan On YCP : కౌలు రైతులను ఆదుకోవటంలోనూ కుల కోణం చూడటమేంటి..?
Pawan Kalyan On YCP: కౌలు రైతుల కడగండ్లకు వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నా స్పందన లేదన్నారు.
Pawan Kalyan On YCP Govt: త్వరలో రైతాంగం కష్టాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కౌలు రైతుల కడగండ్లకు వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులతో హైదరాబాద్ లో భేటీ అయిన పవన్.... పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా కౌలు రైతుల స్థితిగతులపై పవన్ కల్యాణ్ కు నివేదిక అందజేశారు.
సుమారు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడినప్పటికీ వైసీపీ సర్కార్ లో చలనం లేకపోవడం దురదృష్టకరమన్నారు పవన్ కల్యాణ్. అప్పులు తీర్చలేక రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సహాయం చేసే విషయంలో కూడా ప్రభుత్వం కులాన్ని చూస్తోందంటూ ఆరోపించారు. రాష్ట్రంలో పండే వరి పంటలో 80 శాతం కౌలు రైతుల సేద్యం నుంచే వస్తోందన్నారు. ఇంతటి కీలకమైన పంట వేసి నష్టాలు పాలయ్యారని పేర్కొన్నారు. వరితో పాటు మిర్చి, పత్తి లాంటి పంటు వేసి నష్టపోతున్నారని అన్నారు. రైతు భరోసా యాత్రల సందర్భంలో కౌలు రైతుల ఆవేదన నేరుగా తెలుసుకుంటున్నాని చెప్పుకొచ్చారు.
ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.... ఇప్పటివరకు చేసిన రైతు భరోసా యాత్రల ద్వారా 8 జిల్లాల్లోని 700 మందికిపైగా ఆర్థిక సాయం చేశామని వెల్లడించారు. తమ యాత్ర ద్వారా కౌలు రైతులకు భరోసా కల్పిస్తున్నామని అన్నారు. రైతుల పక్షాన పోరాడే పార్టీ జనసేన అని చెప్పారు. వరి పంట కొనుగోలు చేసి కూడా డబ్బులు ఇవ్వకపోతే రైతు సౌభాగ్య దీక్ష చేశామని గుర్తు చేశారు. నివర్ తుపాన్ సమయంలో నష్టపోయిన రైతుల కోసం నిలబడ్డామని చెప్పారు.
సంబంధిత కథనం