TS Farmers Input Subsidy : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తాం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
TS Farmers Input Subsidy : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట నష్టంపై నివేదిక అందగానే ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు.
TS Farmers Input Subsidy : అకాల వర్షాలకు పంట నష్టపోయిన(Crop Damage) రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారని చెప్పారు. అధికారుల నివేదిక సిద్ధం చేస్తున్నారని, అది రాగానే ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం(Farmers Input Subsidy) చెల్లిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఎకరానికి రూ.6 వేలు ఇవ్వాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అస్తవ్యస్త విధానాలతో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం రైతుల(Farmers) కోసమే పనిచేస్తుందని, అయినా కొందరు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పదేళ్లలో రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ(Input Subsidy) ఇవ్వని బీఆర్ఎస్ ఇవాళ రైతులకు సాయం చేసినట్లు విడ్డూరంగా మాట్లాడుతుందని విమర్శించారు. ఎన్నికలకు ముందు హడావుడిగా రూ.150 కోట్లు మాత్రమే పరిహారంగా ఇచ్చారని దుయ్యబట్టారు. గత మే నెల వరకు రైతుబంధు నిధులు జమచేసిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
"అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం అందిస్తాం. ఎల్లంపల్లి, నాగార్జున సాగర్, శ్రీశైలం డెడ్ స్టోరేజీ నుంచి అవసరమైతే మిషన్ భగీరథ పైపుల ద్వారా హైదరాబాద్‌కు నీళ్లు తెస్తాం. బీఆర్ఎస్ నిధులు, నీళ్లు ఖాళీ చేసింది. మొదటి పంటకు నీరు ఇవ్వలేని మీరు రెండో పంటకు ఎలా అడుగుతారు"- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
గొప్పలకు పోయి నీటిని వృథా చేశారు
అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు రైతులను పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీతులు చెబుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. గతంలో గొప్పలకి పోయి నీళ్లు అవసరం లేకపోయినా విడుదల చేసి... నీటిని వృథా చేశారని ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తిని ఒక ప్రణాళిక ప్రకారం చేయకుండా...విలువైన నీటిని సముద్రం పాల్జేశారని మండిపడ్డారు. గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రెండో విడత రుణమాఫీకి రూ.19,600 కోట్లు ప్రకటించి రూ.9500 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇవాళ రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రమశిక్షణతో నిధులు వృథా కాకుండా రైతులను ఆదుకుంటున్నామన్నారు.
బీఆర్ఎస్ ఎప్పుడూ రైతులను ఆదుకున్న పాపానపోలేదని మంత్రి తుమ్మల ధ్వజమెత్తారు. గోదావరికి వరదలు వచ్చి పంటలు పూర్తిగా నష్టపోయినప్పుడు ఏ ఒక్కరూ పట్టించుకోలేదనన్నారు. రుణమాఫీ అమలుచేస్తామని గొప్పలు చెప్పుకుని మొదటి విడత మాఫీని నాలుగు విడతల్లో ఇచ్చారన్నారు. రైతు బంధుపై బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గతంలో మే నెల వరకు రైతులకు నిధులు జమ చేసిన సందర్భాలు మర్చిపోయి, ఇప్పుడు మార్చి నెలలోనే డబ్బులు ఎందుకు వేయలేదని గగ్గోలు పెడుతున్నారన్నారు.