Rythu Bharosa Funds: రైతు భరోసా నిధుల విడుదలకు ఈసీ బ్రేక్, మే 13 తర్వాతే ఖాతాల్లోకి!-ec break to rythu bharosa funds distribution alleged cm revanth reddy election code violation ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Rythu Bharosa Funds: రైతు భరోసా నిధుల విడుదలకు ఈసీ బ్రేక్, మే 13 తర్వాతే ఖాతాల్లోకి!

Rythu Bharosa Funds: రైతు భరోసా నిధుల విడుదలకు ఈసీ బ్రేక్, మే 13 తర్వాతే ఖాతాల్లోకి!

Bandaru Satyaprasad HT Telugu
May 07, 2024 05:15 PM IST

Rythu Bharosa Funds : తెలంగాణలో రైతు భరోసా నిధుల పంపిణీకి ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలుపుతూ నిధుల జమ మే 13 తర్వాత చేపట్టాలని ఆదేశించింది.

రైతు భరోసా నిధుల పంపిణీకి ఈసీ బ్రేక్
రైతు భరోసా నిధుల పంపిణీకి ఈసీ బ్రేక్

Rythu Bharosa Funds : తెలంగాణలో రైతు భరోసా నిధుల జమకు ఈసీ బ్రేక్ వేసింది. సోమవారం నిధుల జమకు అనుమతినిచ్చిన ఈసీ...తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాతే రైతు భరోసా, పంటనష్టం నిధులు రైతుల అకౌంట్లలో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వా్న్ని ఆదేశించింది. రైతు భరోసా నిధుల జమపై సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. ఈ మేరకు నిధుల జమ వాయిదా వేసినట్లు ఈసీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

మే 13 తర్వాతే

మే13న పోలింగ్ ముగిసిన తర్వాత రైతు భరోసా పెండింగ్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ నెల 9న రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామని ఇటీవల బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్‌.వేణు కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టింది. పోలింగ్ ముగిసిన తర్వాతే రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రైతు భరోసా నిధుల విడుదలకు బ్రేక్ పడింది.

నిధుల విడుదల వాయిదా

ఐదు ఎకరాలు పైబడిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతు భరోసా కింద రూ.2 వేల కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. 

తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులు, అకాల వర్షాలు, కరవుతో పంటనష్టపోయిన రైతులను ఆదుకునేందుకు నిధుల విడుదలకు వ్యవసాయశాఖ ఈసీ అనుమతి కోరింది. 

ఇందుకు సోమవారం సాయంత్రం ఈసీ అనమతి తెలిపింది. దీంతో రైతుల ఖాతాల్లో నిధుల జమకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఈసీ బ్రేక్ వేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, అందుకే నిధుల విడుదల వాయిదా వేస్తున్నట్లు ఈసీ తెలిపింది.

బీఆర్ఎస్ చేతికి మరో అస్త్రం

రైతు భరోసా నిధులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మే 9వ తేదీలోపు రైతు భరోసా నిధులు విడుదల చేయకపోతే ముక్కు నేలకు రాస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. 

నిధులు విడుదలైతే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కనీసం బీఆర్ఎస్ ఇచ్చిన రైతు బంధు రూ. 10 వేలు కూడా ఖాతాల్లో వేయలేదని బీఆర్ఎస్... కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. 

కేసీఆర్ ప్రభుత్వంలో సరిగ్గా సమయానికి నిధులు పడ్డాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు ఆగిపోయిందని కేసీఆర్ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల వేళ కేసీఆర్, బీఆర్ఎస్ విమర్శల వేగం పెంచడంతో కాంగ్రెస్ అలర్ట్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్‌కు కౌంటర్లు ఇచ్చారు. మే 9లోపు రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ హామీకి ఈసీ బ్రేక్ వేసింది. దీంతో బీఆర్ఎస్ కు మరో ప్రచార అస్త్రం దొరికినట్లైంది.

Whats_app_banner

సంబంధిత కథనం