Telangana Election Polling 2024 : టైం పొడిగింపు లేదు - ఈ సెగ్మెంట్లలో సాయంత్రం 4 వరకే పోలింగ్..!
Election Polling in Telangana 2024 : లోక్ సభ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి దృష్ట్యా ప్రత్యేకంగా మరికొన్ని చర్యలను చేపడుతున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో త్వరగానే పోలింగ్ ప్రక్రియ పూర్తి అవుతుందని ప్రకటించారు.
Lok Sabha Election Polling in Telangana 2024 : ఎండ తీవ్రత, వడగాలుల కారణంగా పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ను గంట పాటు పెంచుతూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సాయంత్రం ఐదు గంటలకు ముగియాల్సిన పోలింగ్ ఆరు గంటల వరకు కొనసాగనుంది.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆ 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఆయా నియోజకవర్గాల్లో గతంలో సాయంత్రం 5. గంటల వరకు పోలింగ్(Telangana Election Polling) జరిగేది. పోలింగ్ ముగిసిన తర్వాత బాక్స్ లను తరలిస్తుండగా మార్గమధ్యలో మావోయిస్థులు దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. దీంతో మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో పోలింగ్ ను గంట కుదిస్తూ 4 గంటల వరకే పరిమితం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో..
రాష్ట్రంలో ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్(Loksabha Election Polling 2024) జరగనుంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం(EC) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎండ తీవ్రత విపరీతంగా పెరిగినందున పోలింగ్ టైం పెంచాలని రాజకీయ పార్టీలు ఈసీని కోరడంతో పోలింగ్ సమయాన్ని గంట పాటు పెంచింది. దీంతో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్న పోలింగ్ ఇప్పుడు సాయంత్రం 6 గంటల వరకు పెరిగింది.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, అదిలాబాద్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, ములుగు, మంథని, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, సిర్పూర్, ఆసిఫాబాద్, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్(Telangana Election Polling) జరగనుంది. ఆ లోపు పోలింగ్ సెంటర్లలోకి వచ్చే వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించను న్నారు.
తెలంగాణ సరిహద్దులోని చత్తీస్ గఢ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో గత మూడు నెలల కాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో సుమారు 80 మందికిపైగా మావోయిస్టులు చనిపోయారు. ఈ క్రమంలోనే 13 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ టైంను పెంచలేదని స్పష్టం అవుతోంది.
భారీ బందోబస్తు..
ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, విధ్వంసాలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉండడంతో ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని పోలీసులు అలర్ట్ అయ్యారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని పోలీస్ ఆఫీసర్లు ఇప్పటికే చత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ పోలీసులతో కో ఆర్డినేషన్ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ కౌంటర్లు, ఎదురు కాల్పుల ఘటనలతో పాటు ఎన్నికల బహిష్కరణ పిలుపుతో మావోయిస్టుల కోసం తెలంగాణ, ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతాల్లో స్పెషల్ పార్టీ టీంలు, ప్రత్యేక పోలీస్ బలగాలతో కూంబింగ్ చేస్తున్నారు.
స్పెషల్ పార్టీ పోలీస్ టీంలతో పాటు కేంద్ర బలగాలతో కలిసి రాష్ట్ర పోలీసులు మావోయిస్థుల(Maoists) కోసం అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. పోలీస్ ఇన్ఫార్మర్ వ్యవస్థతో పాటు నిఘాను పటిష్టం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఆఫీసర్లతో రెండు రోజుల కింద ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్యూటీలు చేసేవారు అలర్ట్ గా ఉండాలని సూచించారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి - ప్రియాంక, భద్రాద్రి కలెక్టర్..
“ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాం. పోలీస్ ఆఫీసర్లతో ఇప్పటికే కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాం. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు చేపట్టాం. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం” అని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక వెల్లడించారు