Warangal BRS Candidate : వరంగల్ పార్లమెంట్ లో మహిళలే కీలకం, 'ఆమె'కే టికెట్ ఇచ్చే యోచనలో బీఆర్ఎస్!
Warangal BRS Candidate : వరంగల్, మహబూబాబాద్ ఎంపీ స్థానాలకు మహిళా అభ్యర్థులను బరిలోకి దించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో స్త్రీల ఓట్లు ఎక్కువ కాగా మహిళలనే బరిలో దించి, గెలవాలని చూస్తోంది.
Warangal BRS Candidate : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్(BRS) పార్టీ మహిళా ఈక్వేషన్ లో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్త్రీల ఓట్లే ఎక్కువ కాగా.. అభ్యర్థులుగా మహిళలనే బరిలో దించి, గెలవాలని చూస్తోంది. ఇప్పటికే మహబూబాబాద్ ఎంపీ టికెట్(MP Ticket) ను అక్కడి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకు కేటాయించగా.. వరంగల్ (Warangal)స్థానంలోనూ మహిళనే పోటీకి దించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు, కడియం కావ్య(Kadiyam Kavya)కు టికెట్ ఇవ్వగా.. ఆమె బీఆర్ఎస్ లోకి జంప్ కావడంతో బీఆర్ఎస్ మరో అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువ కాగా.. ఎంపీ టికెట్ కూడా మహిళకే కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న(Peddi Swapna) పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
సగానికి పైగా వాళ్లే
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్(SC Reserved) కాగా ఇక్కడ స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో మొత్తంగా 18,16,428 మంది ఓటర్లు ఉండగా.. అందులో సగానికంటే ఎక్కువ స్త్రీల ఓట్లే ఉన్నాయి. పురుషులు 8,92,527 మంది ఉండగా, మహిళా ఓటర్లు 9,23,510 మంది ఉన్నారు. ఇక ఇతరులు 392 మంది ఉన్నారు. కాగా మహిళ ఓట్లే ఎక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ మార్చి 13న రిలీజ్ చేసిన క్యాండిడేట్ల జాబితాలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించింది. కానీ మార్చి 31 ఆమె పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ లోకి చేరడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. దీంతోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం చూస్తోంది.
టికెట్ పెద్ది స్వప్నకేనా..?
రెండు నెలల కిందట బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన, స్టేషన్ ఘన్ పూర్(Station Ghanpur) మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Tadikonda Rajaiah) ఎంపీ టికెట్ కోసం మళ్లీ గులాబీ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతుండగా.. ఉద్యమకారులు జోరిక రమేశ్, బోడ డిన్న కూడా టికెట్ ఆశిస్తున్నారు. కానీ మహిళా ఓటర్లను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ టికెట్ ను మహిళకే ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కడియం కావ్య పార్టీ నుంచి బయటకు వెళ్లిన నేపథ్యంలో పెద్ది స్వప్న పేరు తెరమీదకు వచ్చింది. మాల సామాజిక వర్గానికి చెందిన పెద్ది స్వప్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా పోటీ చేసి, ఫ్లోర్ లీడర్ గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పాల్గొన్న మహిళగా ఆమెకు పేరుండగా.. ఇటు లీడర్ల సపోర్ట్, ఉద్యమకారుల మద్దతు, మహిళా ఓటర్ల ప్రభావం ఆమెకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతోనే పెద్ది స్వప్నను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రచారం జోరందుకుంది. కాగా వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి అరూరి రమేశ్ బరిలో ఉన్న విషయం తెలిసిందే.
మహబూబాబాద్ లోనూ సేమ్ సీన్
మహిళా ఓటర్లు ఎక్కువగా చోట్లా వారినే సెంటర్ పాయింట్ గా చేసి బీఆర్ఎస్(BRS) వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ అదే ఫార్ములాను అవలంబిస్తోంది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ కాగా.. డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తంగా 15,26,998 మంది ఓటర్లు ఉండగా.. అందులో 7,45,554 మంది పురుషులు, 7,81,339 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో 105 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. 2019 ఎన్నికల్లో మహిళా ఫార్ములా వినియోగించిన బీఆర్ఎస్ అప్పటి సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ ను తప్పించి, మాలోత్ కవితకు ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే తీరుగా మళ్లీ కవితకే టికెట్ కేటాయించడంతో ఆమె ప్రచారం కూడా మొదలు పెట్టింది. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లను టార్గెట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం