TS Triangle War: మహబూబాబాద్‌‌లో ముక్కోణపు పోటీ… రెండోసారి పార్లమెంటుకు వెళ్ళేదెవరు?-triangular competition in mahbubabad who will go to parliament for the second time ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ts Triangle War: మహబూబాబాద్‌‌లో ముక్కోణపు పోటీ… రెండోసారి పార్లమెంటుకు వెళ్ళేదెవరు?

TS Triangle War: మహబూబాబాద్‌‌లో ముక్కోణపు పోటీ… రెండోసారి పార్లమెంటుకు వెళ్ళేదెవరు?

HT Telugu Desk HT Telugu
Apr 04, 2024 09:33 AM IST

TS Triangle War: మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంపై అన్ని ప్రధాన పార్టీలు గురి పెట్టాయి. మిగిలిన నియోజకవర్గాల కంటే ముందే ఇక్కడ అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికల కదన రంగంలో అభ్యర్థులను బరిలో దించాయి.

మహబూబాబాద్‌లో ముక్కోణపు పోటీ
మహబూబాబాద్‌లో ముక్కోణపు పోటీ

TS Triangle War: మహబూబాబాద్‌ mahabubabad పార్లమెంటు loksabha స్థానానికి కాంగ్రెస్ Congress నుంచి బలరాం నాయక్, బీజేపీ Bjp నుంచి సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత పోటీ పడుతున్నారు. మహబూబాబాద్ స్థానంలో పోటీలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులు ఒక్కోసారి ఎంపీగా గెలిచిన వాళ్లే కాగా.. మరోసారి నెగ్గి రెండోసారి పార్లమెంట్ లో అడుగు పెట్టాలని ముగ్గురూ తహతహలాడుతున్నారు. ఈ మేరకు మూడు పార్టీల నేతలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు.

ఇద్దరు మాజీలు.. ఒకరు సిట్టింగ్

మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ కాగా.. దీని పరిధిలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇక్కడ పోటీలో నిలబడిన మూడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల్లో ఇద్దరు మాజీ ఎంపీలు, ఒకరు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు.

కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న బలరాం నాయక్ 2009 లో ఎంపీగా ఎన్నికై ఐదేళ్లపాటు కొనసాగారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా.. ఆ సమయంలో 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సీతారాం నాయక్ విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో సీతారాం నాయక్ మళ్లీ టికెట్ ఆశించినప్పటికీ.. పార్టీ నిరాకరించడంతో తాజాగా ఆయన బీజేపీలో చేరి కమలం పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. ఇక 2019లో సీతారాం నాయక్ ను పక్కకు నెట్టి టికెట్ దక్కించుని విజయం సాధించిన మాలోతు కవిత.. సిట్టింగ్ ఎంపీగా, మరోసారి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు.

ముగ్గురు ఉద్దండుల.. ఉత్కంఠ పోరు

ప్రస్తుతం ఈ ముగ్గురు మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుంచి మరోసారి ఎంపీగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాలుగోసారి ఎన్నికల బరిలో నిలవగా.. అజ్మీరా సీతారాం నాయక్ రెండోసారి, బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత కూడా రెండోసారి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బలరాం నాయక్, కేంద్రంలో స్ట్రాంగ్ ఉన్న బీజేపీ నుంచి సీతారాం నాయక్, ఇక ఉద్యమపార్టీగా పేరున్న బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత పోటీలో నిలవగా.. ముగ్గురు ఉద్ధండుల మధ్య పోటీ రసవత్తరంగా సాగనుంది. ముగ్గురూ స్ట్రాంగ్ గా ఉన్న అభ్యర్థులే కావడంతో మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో ఈసారి పోరు ఉత్కంఠభరితంగా సాగే అవకాశం కనిపిస్తోంది.

ఎవరి ధీమా వారిదే..

బలరాం నాయక్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన కృషి కలిసి వస్తుందని ఆయన ఆశాభావంతో ఉన్నారు. అంతేగాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, పలుమార్లు ఓటమి పాలైన సానుభూతి కలిసి వస్తుందని ఆయన గెలుపు ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సీతారాం నాయక్ కు వివాదరహితుడిగా పేరుంది. అంతేగాకుండా పాత పరిచయాలు, గతంలో ఎంపీగా ఉన్న సమయంలో చేసిన పనులు, బీఆర్ఎస్ నేతలతో ఉన్న అనుబంధం, అన్నికంటే ముఖ్యంగా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా తన గెలుపుకు బాటలు వేస్తాయని సీతారాం నాయక్ కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత ఎంపీగా కాకుండా ఎమ్మెల్యే తరహాలోనే ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఉద్యమపార్టీ, కేసీఆర్ పేరు, కాంగ్రెస్ బీజేపీ పాలనలో మైనస్ లు తనకు కలిసి వస్తాయని కవిత అంచనా వేస్తున్నట్లు తెలిసింది. ఇలా ఎవరికి వారు గెలుపు ధీమాతో ఉండగా.. ఎవరు గెలిచినా రెండోసారి పార్లమెంట్ లో అడుగు పెట్టే అవకాశం దక్కినట్లవుతుంది.

ముగ్గురు దిగ్గజాలు పోటీ పడుతున్న మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎటు వైపు మొగ్గుతారో.. ఎవరిని రెండో సారి పార్లమెంట్ కు పంపిస్తారో చూడాలి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

సంబంధిత కథనం