Telangana Congress : కాంగ్రెస్ లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..! ఆ రోజే చేరిక
Telangana Congress Party News: బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నాయి. ఈనెల 6వ తేదీన కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
Bhadrachalam BRS MLA Tellam Venkat Rao: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓవైపు మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ… మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ కు మరింతగా పదును పెడుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలకు కాంగ్రెస్ కండువా కప్పటంలో సక్సెస్ అయిన పార్టీ… ఇటీవలే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా పార్టీలోకి తీసుకుంది. కట్ చేస్తే… మరో ఎమ్మెల్యే కూడా హస్తం పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ లోకి భద్రాచలం ఎమ్మెల్యే….
గతేడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్ విజయం సాధించారు. మిగిలిన 8 స్థానాల్లోనూ కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. అయితే తెల్లం వెంకట్రావ్(BRS MLA Tellam Venkat Rao) కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన… తాజాగా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఇల్లెందులో జరిగిన ఈ సమావేశంలో తెల్లం వెంకట్రావ్ కూడా కనిపించారు. దీంతో ఆయన హస్తం కండువా కప్పుకోవటం ఖరారే అన్న టాక్ వినిపిస్తోంది.
ఈ నెల 6వ తేదీన ముహుర్తం…!
ఈ నెల 6వ తేదీను తుక్కుగూడ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ భారీ సభను తలపెట్టింది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఖర్గే ఈ సభకు హాజరుకానున్నారు. ఈ సభా వేదికపైనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్(BRS MLA Tellam Venkat Rao)... కాంగ్రెస్ లో చేరనున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇందులో దానం నాగేందర్… సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. ఇక కడియం శ్రీహరి కుమార్తె… కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ దక్కింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీలోని కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేపథ్యంలో…. త్వరలోనే తెల్లం కూడా చేరిపోనున్నాయి. అయితే లోక్ సభ ఎన్నికల కంటే ముందే…. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరవచ్చని తెలుస్తోంది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.