Ponguleti Follower: బిఆర్‌ఎస్‌లోకి పొంగులేటి అనుచరుడు తెల్లం వెంకట్రావు
Ponguleti Follower: కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడు షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ తరపున భరోసా దక్కకపోవడంతో బిఆర్‌ఎస్ గూటికి చేరారు.
Ponguleti Follower: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. బిఆర్‌ఎస్‌తో విభేదించి కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎంపీ పొంగులేటికి ఆయన అనుచరుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు షాక్ ఇచ్చారు. బిఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు తెల్లం వెంకట్రావు సిద్దమయ్యారు. గత నెల 2వ తేదీన కాంగ్రెస్‌లో చేరారు.
అంతకు ముందు భద్రాచలం నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్‌లో అభ్యర్థిత్వం విషయంలో ఎలాంటి భరోసా రాకపోవడంతో డా. తెల్లం వెంకట్రావు సొంతగూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. దుమ్ముగూడెం జడ్పీటీసీ సభ్యురాలు తెల్లం సీతమ్మతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. గురువారం మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు భద్రాచలం నేతలు చెబుతున్నారు.
అసెంబ్లీ టికెట్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుంచి హామీ లభించకపోవడం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి సరైన స్పందన లభించక పోవడంతో వెంకట్రావు అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు నుంచి భద్రాచలం అసెంబ్లీ టికెట్ ఇస్తామని వెంకట్రావుకు భరోసా దక్కినట్లు వెంకట్రావు అనుచరులు చెబుతున్నారు.
భద్రాచలం కరకట్ట నిర్మాణానికి తక్షణం రూ.25 కోట్లు నిధులు మంజూరు చేయడంతో పాటు, ఇతరత్రా హామీలు రావడంతో సొంతగూటికి చేరేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. డీసీసీబీ డైరెక్టర్ బ్రహ్మయ్య… వెంకట్రావు పార్టీ వీడకుండా బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు.
పొంగులేటి చెప్పడంతో బ్రహ్మయ్య భద్రాచలం వచ్చి వెంకట్రావుతో చర్చలు జరిపారు. తనకు ఇదే చివరి అవకాశమని, ఎన్నికల్లో పోటీ చేయడం ముఖ్యమని వెంకట్రావు స్పష్టం చేసినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ నుంచి అభ్యర్థిత్వానికి భరోసా రావడంతో వెళ్తున్నట్లు తేల్చి చెప్పారు. పొంగులేటి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే బీఆర్‌ఎస్ కుట్రలకు పాల్పడుతోందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
తెల్లం వెంకట్రావ్ 2014లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్ భద్రాచలం ని యోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కొన్ని నెలలుగా పొంగులేటితో కలి సి రాజకీయ ప్రయాణం చేశారు. గత నెలలో కాంగ్రెస్‌లో చేరారు. తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్దమయ్యారు.