IPL 2024 Qualifier 1 KKR vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఈ ఐదుగురు ప్లేయర్సే కీలకం.. కేకేఆర్‌తో తొలి క్వాలిఫయర్ నేడే
IPL 2024 Qualifier 1 KKR vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్ మధ్య ఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్ మంగళవారం (మే 21) అహ్మదాబాద్ లో జరగనుంది. సన్ రైజర్స్ తరఫున ఈ ఐదుగురు ప్లేయర్స్ కీలకం కానున్నారు.
IPL 2024 Qualifier 1 KKR vs SRH: ఐపీఎల్ 2024లో నిలకడగా ఆడిన జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటి. విధ్వంసకర బ్యాటింగ్, భారీ స్కోర్లతో ప్రత్యర్థులను గడగడలాడిస్తూ పాయింట్ల టేబుల్లో రెండో స్థానంతో ప్లేఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. ఇవాళ (మే 21) కోల్‌కతా నైట్ రైడర్స్ తో తొలి క్వాలిఫయర్ నేపథ్యంలో ఈసారి కూడా జట్టులోని ఐదుగురు ప్లేయర్స్ కీలకం కానున్నారు.
ఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్
ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ లో తొలి రెండు స్థానాల్లో కేకేఆర్, సన్ రైజర్స్ నిలిచాయి. ఇప్పుడీ ఇద్దరి మధ్య తొలి క్వాలిఫయర్ జరగనుంది. ఇందులో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టుకు రెండో క్వాలిఫయర్ రూపంలో మరో ఛాన్స్ ఉంటుంది. లీగ్ స్టేజ్ మొత్తం భారీ స్కోర్లతో ఈ రెండు జట్లు ప్రత్యర్థులను హడలెత్తించాయి.
14 మ్యాచ్ లలో ఈ రెండు టీమ్స్ ఆరేసి సార్లు 200కుపైగా స్కోర్లు సాధించాయి. అందులో సన్ రైజర్స్ అయితే రెండుసార్లు (277 vs ముంబై, 287 vs ఆర్సీబీ) రికార్డు స్కోర్లు చేయగా.. కేకేఆర్ అత్యధికంగా 272 రన్స్ చేసింది. దీంతో భారీ హిట్టర్ల పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో అన్న ఆసక్తి నెలకొంది. రెండు జట్ల విజయాల్లోనూ కొందరు కీలకమైన ప్లేయర్స్ ప్రభావం చూపనున్నారు.
సన్ రైజర్స్‌కు వీళ్లే కీలకం
సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో బౌలింగ్ కంటే బ్యాటింగ్ తోనే ఎక్కువ విజయాలు సాధించింది. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థుల బౌలింగ్ ను చీల్చి చెండాడారు. పవర్ ప్లేలోనే హెడ్, అభిషేక్ ప్రత్యర్థి జట్ల నుంచి సగం మ్యాచ్ ను లాగేసుకుంటున్నారు. దీంతో తొలి క్వాలిఫయర్ లోనూ ఈ ఇద్దరు ఓపెనర్లు చాలా కీలకం.
వీళ్లు అదే దూకుడు కొనసాగిస్తే మొదట్లోనే కేకేఆర్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లోనే అత్యంత ఖరీదైన ప్లేయర్ అయిన స్టార్క్.. సన్ రైజర్స్ ఓపెనర్లు హెడ్, అభిషేక్ మధ్య హోరాహోరీ పోరు తప్పదు. ఆ తర్వాత బ్యాటింగ్ లో మరో విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కూడా కీలకం కానున్నాడు. మిడిల్ ఓవర్లలో మ్యాచ్ ను ఒంటిచేత్తో మార్చేసే సత్తా అతని సొంతం.
ఇక బౌలింగ్ లో భువనేశ్వర్, నటరాజన్ కీప్లేయర్స్ అని చెప్పొచ్చు. ఈ సీజన్లో సన్ రైజర్స్ తరఫున నటరాజన్ 17 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. ధాటిగా ఆడే కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ కు చెక్ పెట్టే బాధ్యత భువనేశ్వర్ తోపాటు నటరాజన్ చేతుల్లోనే ఉంది. మరో విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ వెళ్లిపోవడం కేకేఆర్ కు కాస్త ప్రతికూలమనే చెప్పాలి.
కేకేఆర్ వెర్సెస్ ఎస్ఆర్‌హెచ్
ఐపీఎల్లో సన్ రైజర్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ దే పైచేయి. ఇప్పటి వరకూ ఈ రెండు టీమ్స్ మొత్తంగా 26సార్లు తలపడ్డాయి. అందులో 17 మ్యాచ్ లలో కేకేఆర్ గెలవగా.. 9 మ్యాచ్ లలో సన్ రైజర్స్ విజయం సాధించింది. ఈ సీజన్ రెండో రోజే ఈ రెండు టీమ్స్ తలపడ్డాయి. అందులో కేకేఆర్ నాలుగు పరుగుల తేడాతో సన్ రైజర్స్ ను ఓడించింది.
ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ 200కుపైగా స్కోర్లు చేశాయి. మొదట కేకేఆర్ 208 రన్స్ చేయగా.. తర్వాత సన్ రైజర్స్ ఈ టార్గెట్ చేజ్ చేసేలా కనిపించారు. చివరికి 4 పరుగుల దూరంలో ఆగిపోయారు. మరి తొలి క్వాలిఫయర్ లో ఎస్ఆర్‌హెచ్ ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూడాలి.