Gautham Gambhir: సెలెక్టర్ కాళ్లు మొక్కలేదని ఎంపిక చేయలేదు.. అప్పటి నుంచీ అలా..: గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Gautham Gambhir: గౌతమ్ గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను చిన్నతనంలో ఓ సెలక్టర్ కాళ్లు మొక్కలేదన్న ఉద్దేశంతో తనను జట్టులోకి ఎంపిక చేయలేదని చెప్పాడు. అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో అతడు మాట్లాడాడు.

Gautham Gambhir: గౌతమ్ గంభీర్ కు ముక్కుసూటిగా మాట్లాడతాడన్న పేరుంది. అవతలి వాళ్లు ఏమనుకున్నా పెద్దగా పట్టించుకోడు. తాజాగా అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో అతడు మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన చిన్నతనంలో ఓ సెలక్టర్ కాళ్లు మొక్కలేదని తనను జట్టులోకి ఎంపిక చేయలేదని, అప్పటి నుంచి తాను ఎవరి కాళ్లూ మొక్కలేదు.. తన కాళ్లు ఎవరూ మొక్కకుండా చూసుకున్నానని అతడు చెప్పడం గమనార్హం.
కాళ్లు మొక్కలేదని..
టీమిండియా క్రికెటర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో నిర్వహించే పాడ్‌కాస్ట్ లో గంభీర్ మాట్లాడాడు. ఈ సందర్భంగా అతడు చెప్పిన మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. "నేను ఎదుగుతున్న క్రమంలో 12 లేదా 13 ఏళ్లు ఉండొచ్చు. అండర్ 14 టోర్నమెంట్లో తొలిసారి ఆడాలనుకున్న సమయంలో నేను ఎంపిక కాలేదు. ఎందుకంటే నేను ఓ సెలక్టర్ కాళ్లు మొక్కలేదు. ఆ రోజు నుంచి ఒకటే నిర్ణయించుకున్నాను. నేను ఎవరి కాళ్లూ మొక్కను. నా కాళ్లు ఎవరూ మొక్కకుండా చూసుకుంటాను అని" అని గంభీర్ చెప్పాడు.
తానో విజయవంతమైన క్రికెటర్ కావాలని అనుకోవడం లేదన్న భావన మొదట్లో చాలా మందిలో ఉండేదని కూడా ఈ సందర్భంగా అతడు తెలిపాడు. "నా కెరీర్ చూసుకుంటే మొదట్లో నేను ప్రతి దశలో ఫెయిలయ్యాను. అది అండర్ 16, అండర్ 19, రంజీ ట్రోఫీ, అంతర్జాతీయ కెరీర్ మొదట్లోనూ విఫలమయ్యాను. నువ్వో మంచి కుటుంబం నుంచి వచ్చావు.. నీకు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు. నీకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. మీ నాన్న బిజినెస్ చూసుకోవచ్చు అనేవాళ్లు" అని గంభీర్ గుర్తు చేసుకున్నాడు.
వాళ్ల కంటే నేనే ఎక్కువ కోరుకున్నాను
తన కెరీర్లో బయటి నుంచి తాను ఎదుర్కొన్న అతిపెద్ద సవాలును కూడా గంభీర్ వెల్లడించాడు. "మిగతా క్రికెటర్లతో పోలిస్తే నాకు అంతగా అవసరం లేదు అన్న భావన చాలా మందిలో ఉండేది. అది నా మనసులో అలా ఉండిపోయింది. కానీ వాళ్ల కంటే నాకే ఎక్కువ అవసరం అన్న విషయాన్ని ఎవరూ గుర్తుంచుకోలేకపోయారు. దానిని మార్చాలని అనుకున్నాను. చేసి చూపించాను. అలాంటప్పుడు ఇంకెవరి అభిప్రాయాలూ నాపై ప్రభావం చూపవు" అని గంభీర్ అన్నాడు.
ఇండియా తరఫున గంభీర్ 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. వన్డేల్లో 11 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలతో 5238 రన్స్.. టెస్టుల్లో 9 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలతో 4154 రన్స్.. టీ20ల్లో ఐదు హాఫ్ సెంచరీలతో 932 రన్స్ చేశాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గా ఉన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం కూడా అతన్ని బీసీసీఐ సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఇదే యూట్యూబ్ ఛానెల్లో గంభీర్ ఐపీఎల్ గురించి కూడా స్పందించాడు. “ఫ్రాంఛైజీ క్రికెట్ కంటే అంతర్జాతీయ క్రికెట్ చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు నేను వెనుదిరిగి చూస్తే ఫ్రాంఛైజీ క్రికెట్ అంతర్జాతీయ టీ20ల కంటే కష్టంగా మారింది. ముఖ్యంగా ఐపీఎల్. మొదట్లో అంతర్జాతీయ క్రికెట్ లో ఐదారుగురు కఠినమైన బౌలర్లను ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ ఐపీఎల్లో మొదట్లో ఇంత స్టాండర్డ్ గా ఉండేది కాదు. ఒకరిద్దరు దేశవాళీ బౌలర్లను టార్గెట్ చేయాల్సి వచ్చేది” అని గంభీర్ అన్నాడు.