BRS Vs Congress : తెలంగాణలో కరవు రాజకీయం- బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు
BRS Vs Congress : తెలంగాణలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. జలాశయాల్లో నీళ్లు లేకపోవడంతో సాగుకు నీటి ఎద్దడి లేక పంటలు ఎండిపోతున్నాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కరవు పరిస్థితులపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడి తిట్టుకుంటున్నాయి.
BRS Vs Congress : తెలంగాణలో సరైన వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లు అడుగంటిపోతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న కరవు(TS Drought) పరిస్థితులు, ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ (BRS vs Congress)ఒకరినొకరు నిందించుకోవడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి ఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. యాసంగి పంటలకు నీటి సరఫరా లేకపోవడం పంటలు ఎండిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జగదీశ్ రెడ్డితో పాటు స్థానిక పార్టీ నేతలతో కలిసి కేసీఆర్ జనగాంలోని దేవరుప్పుల తరావతి తండా, సూర్యాపేట తుంగతుర్తి, నల్గొండ జిల్లా నిడమనూరులో పంట పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల పంటలు ఎండిపోలేదని, పరిస్థితిని సమర్థంగా నిర్వహించకపోవడం వల్లే ఈ మానవ విపత్తు ఎదురైందని కేసీఆర్(KCR) అన్నారు. నాగార్జునసాగర్(Nagarjuna Sagar) ఎడమ కాలువలో దాదాపు 14 టీఎంసీల(TMC) నీరు ఉన్నప్పటికీ ఎండిపోయిన వ్యవసాయ పొలాలకు సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కరెంటు సరిగా లేకపోవడంతో రైతులు భూగర్భ జలాలను కూడా వినియోగించుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో కేవలం 100 రోజుల వ్యవధిలో రాష్ట్రం విద్యుత్ సంక్షోభాన్ని(Power Crisis) ఎదుర్కొంటోందన్నారు. వరి పంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2న ఆయా కలెక్టర్లకు బీఆర్‌ఎస్ నాయకులు మెమోలు అందజేస్తారని, పంటలకు పరిహారం ఇవ్వాలని కోరుతూ ఏప్రిల్ 6న బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని కేసీఆర్ ప్రకటించారు. అన్ని వరి కొనుగోలు కేంద్రాల వద్ద కూడా నిరసన తెలిపాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ సేకరించిన సమాచారం ప్రకారం 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ లాంటి సంపన్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నాకు.
సాగునీటిపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదు
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సోమవారం తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్(KCR) చెప్పే ప్రతి మాట పచ్చి అబద్ధమని కొట్టిపారేసింది. గత 100 రోజుల్లో పంట నష్టం కారణంగా 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది పచ్చి అబద్ధమని ఆయన అన్నారు. దాదాపు 200 మందికి పైగా బీఆర్‌ఎస్ నేతలు(BRS) పార్టీ ఫిరాయించడంతో ఆయన నిస్పృహతో మాట్లాడుతున్నారేమోనని ఎద్దేవా చేశారు. పంటల బీమా పథకాన్ని రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తన పాలనలో పంట నష్టం జరిగినప్పుడు ఆయన రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ(Madigadda Barrage) కూలిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, సాగునీటిపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు.
కరవు పరిస్థితులపై కేసీఆర్ రాజకీయాలు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే రబీ సీజన్ ప్రారంభమైందని, వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లు ఎండిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న కరవు(Drought Situation) పరిస్థితులపై కేసీఆర్ రాజకీయాలు చేయడం జుగుప్సాకరమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీళ్లు రాలేదని, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖరీఫ్ పంటకు నీరు ఇవ్వలేకపోయిందని గుర్తు చేశారు. నవంబర్‌లో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నాగార్జునసాగర్(Nagarjuna Sagar) నుంచి కృష్ణా నది నీటిని(Krishna River Water) మళ్లిస్తున్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందని ఆరోపించారు. గత పదేళ్లలో పంటలు కోల్పోయిన రైతులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏనాడూ ఆదుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు కేసీఆర్(KCR) తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
సంబంధిత కథనం