BSP Telangana : ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీని బదిలీ చేయండి - ఈసీకి ఆర్ఎస్పీ ఫిర్యాదు
Telangana Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికారుల బదిలీల వ్యవహరం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆసిఫిబాద్ జిల్లా ఎస్పీని కూడా బదిలీ చేయాలంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు
Telangana Assembly Elections 2023: రాబోయే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్ ను తక్షణమే బదిలీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదారాబాద్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజు కు ఫిర్యాదును అందజేశారు. ఇందుకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు.
జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే కోనేరు కొనప్పతో అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఎన్నికల ప్రధాన అధికారికి వివరించామని ఆర్ఎస్పీ వెల్లడించారు. అన్ని అంశాలను పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హామీ ఇచ్చారన్నారని చెప్పారు.
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఎమ్మెల్యేకు చెందిన ఓ ప్రైవేట్ ట్రస్టు (కోనేరు కోనప్ప ట్రస్ట్)కి జిల్లా ఎస్పీ వెళ్లి ప్రజల ముందు ఎమ్మెల్యేను సన్మానించి అక్కడ ఫోటోలు దిగిన తీరును పిర్యాదుకు జతచేశారు. వచ్చే ఎన్నికల్లో మద్యం,డబ్బు పంపిణీపై ఎన్నికల సంఘం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి, ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప కుటుంబంతో పాటు బీఆర్ఎస్ నేతలు… అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నప్పటికీ, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులపై కేసు నమోదు చేయడంలేదని ఆరోపించారు.
జిల్లాలో ప్రతిపక్ష నాయకులపై, రాజకీయ ప్రత్యర్థులపై జిల్లా ఎస్పీ…. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని ఉపయోగించి తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.అక్రమ కేసుల వెనుక ఎమ్మెల్యే కోనేరు కొనప్ప హస్తం ఉందని ఆరోపించారు. బీఎస్పీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన అమాయక విద్యార్థి వాలంటీర్లను ఎమ్మెల్యే అనుచరులు కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టినా… కాగజ్‌నగర్ రూరల్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు భయపడ్డారని అన్నారు. స్వయంగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో మాట్లాడితే తప్ప, ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. తెలంగాణాలో జరగనున్న రాబోయే ఎన్నికల్లో నిష్పక్షపాతంగా జరిగేలా ఐఏఎస్,ఐపీఎస్ ల బదిలీలు చేపట్టినందుకు ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.