AP Rains : రేపు ఏపీలో మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం
AP Rains : రేపు కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
AP Rains : ఏపీకి వాతావరణ శాఖ వర్షసూచన తెలిపింది. ఉత్తర కోస్తా, యానాంలో రేపు(గురువారం) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు(AP Rains) లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి ఉత్తర కోస్తాలో వాతావరణం(Weather Report) పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పిడుగులు పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ప్రకటించింది.
భారీ వర్షాలు
విజయనగరం జిల్లా గరివిడిలో నిన్న అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయ్యంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు(Rains) కురిశాయి. బుధవారం అనకాపల్లిలో ఐదు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని ప్రకటించింది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
ఉపరితల ఆవర్తనం
నిన్నటి వరకూ పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం...ఇవాళ ఉత్తర తెలంగాణ పరిసరాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న దక్షిణ తమిళనాడు నుంచి పశ్చిమ విదర్భ వరకు విస్తరించి ఉన్న ద్రోణి... ఇవాళ కేరళ నుంచి ఉత్తర తెలంగాణ వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. కోస్తాంధ్ర, యానంలో(Coastal Andhra Rains) దక్షిణ గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో(TS Rains) రేపు కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad) వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ వర్షసూచన జారీచేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉదయం పొగమంచు, రోజంతా మబ్బులు ఉండొచ్చని చెప్పింది.