BJP MP Srinivasa Varma : బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్ లో చోటు, ఏపీ నుంచి ముగ్గురికి ఛాన్స్
BJP MP Srinivasa Varma : కేంద్ర కేబినెట్ లో ఏపీకి మూడో బెర్తు ఖరారైంది. ఇద్దరు టీడీపీ ఎంపీలకు కేంద్ర మంత్రుల పదువులు రాగా, తాజాగా బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కింది.
BJP MP Srinivasa Varma : కేంద్ర మంత్రి వర్గంలో ఏపీ నుంచి మరో ఎంపీకి అవకాశం దక్కింది. నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించింది. ఆయనకు సీఎంవో నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇప్పటికే ఏపీకి చెందిన ఇద్దరు టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర కేబినెట్ లో స్థానం లభించింది. ఆదివారం సాయంత్రం మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు 30 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు
ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి పోటీ చేసిన భూపతిరాజు శ్రీనివాసవర్మ వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. శ్రీనివాస వర్మ ఏపీ బీజేపీలో సీనియర్ నేత. ఏళ్ల పాటు బీజేపీలో పనిచేశారు. 1988లో బీజేపీ కార్యకర్తగా తన రాజకీయ జీవితం ప్రారంభించిన శ్రీనివాస వర్మ...1992-95లో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు రెండు సార్లు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో భీమవరం మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన ఆయన...ఇన్‌ఛార్జ్ ఛైర్మన్‌గా సేవలందించారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో నర్సాపురం ఎంపీగా విజయం సాధించారు. భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశారు.
తెలంగాణ నుంచి ఇద్దరికి ఛాన్స్
తెలంగాణ నుంచి గెలిచిన ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది. సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ కు పీఎంవో నుంచి కాల్స్ వచ్చాయి. ఇవాళ సాయంత్రం మోదీతో పాటు వీరిద్దరూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి మరోసారి ఎంపీగా గెలిచారు. గతంలోనూ ఇదే స్థానం విజయం సాధించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.
బండి సంజయ్ విషయానికొస్తే… 2019 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. బీఆర్ఎస్ కంచుకోటగా భావించే ఈ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ పై విక్టరీ కొట్టారు. అంతకుముందుకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్ ఓడిపోయారు. 2019లో తొలిసారిగా ఎంపీగా గెలిచిన సంజయ్… 2024 ఎన్నికల్లోనూ మరోసారి ఇదే స్థానం నుంచి విజయం సాధించారు. అయితే 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి కమలాకర్ చేతిలో ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర కేబినెట్ లో చోటు సాధించారు.
ఆదివారం సాయంత్రం.. భారత దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మొత్తం 78-81 మంది మంత్రుల వరకు మోదీ కేబినెట్లో ఉంటారని, కానీ ఆదివారం మాత్రం 30 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని జాతీయ వార్తా సంస్థ ఎన్డీటీవీ తెలిపింది.
సంబంధిత కథనం