RRR And CBN: రఘురామ వ్యవహారంలో ఏమి జరిగింది? నర్సాపురం టిక్కెట్ ఇవ్వక పోవడానికి కారణమేంటి?-what happened in the raghurama affair what is the reason for not giving narsapuram ticket ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Rrr And Cbn: రఘురామ వ్యవహారంలో ఏమి జరిగింది? నర్సాపురం టిక్కెట్ ఇవ్వక పోవడానికి కారణమేంటి?

RRR And CBN: రఘురామ వ్యవహారంలో ఏమి జరిగింది? నర్సాపురం టిక్కెట్ ఇవ్వక పోవడానికి కారణమేంటి?

Sarath chandra.B HT Telugu
Mar 27, 2024 11:10 AM IST

RRR And CBN: రఘురామ కృష్ణం రాజు వ్యవహారంలో చాలా అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నర్సాపురం బీజేపీ లోక్‌ సభ అభ్యర్ధి ఎంపిక వెనుక ఏమి జరిగిందనేది మిస్టరీ గా మారింది.

ఎంపీ రఘురామకృష్ణ రాజు
ఎంపీ రఘురామకృష్ణ రాజు

RRR And CBN: రఘురామ కృష్ణమ రాజుకు నర్సాపురం లోక్‌సభ్ అభ్యర్థిత్వం దక్కకపోవడం వెనుక ఏమి జరిగిందనేేది ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చగా మారింది.

నాలుగేళ్లుగా టీడీపీని, బీజేపికి చేరువ చేయడానికి ప్రయత్నించిన రఘురామకు చివరి నిమిషంలో బీజేపీ నుండి టిక్కెట్ దక్కకపోవడం, ఆ వెంటనే బీజేపీ నాయకుల సాయంతో, సిఎం జగన్ చక్రం తిప్పారని చేసిన ఆరోపణలు.. ఎన్డీఏ కూటమిలో చర్చగా మారాయి.

బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి అభ్యర్థుల ఎంపికను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభావితం చేస్తున్నారని అర్థం వచ్చేలా రఘురామ చేసిన వ్యాఖ్యలు కూటమికి చేటు చేసేలా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

నర్సాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ నాలుగేళ్లుగా వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓసారి ఏపీ సిఐడి అరెస్ట్‌ కూడా చేసింది. కస్టడీలో తనను హింసించారని రఘురామ ఆరోపించారు. నాలుగేళ్ళలో ప్రతిపక్ష పార్టీల కంటే, వైసీపీ సభ్యుడిగా ఉంటూనే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిపై వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు.

రఘురామ కృష్ణమరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేసిన లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయంలో అవి ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. తనపై అనర్హత వేటు వేయించలేరని, తానే వైసీపీకి రాజీనామా చేస్తున్నానని 2022లో రఘురామ ప్రకటించారు.

ప్రెస్‌ మీట్‌ పెట్టి మరి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించినా ఆ తర్వాత ఆయన వెనక్కి తగ్గారు. బహుశా ఎన్నికల్లో అధికార పార్టీ అర్థ, అంగ బలాన్ని తట్టుకుని నిలబడి గెలవడంపై సందేహంతోనే రాజీనామా చేయకుండా చివరి వరకు ఎంపీగా కొనసాగినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో రఘురామ సేఫ్‌ గేమ్ అనుకుని సెల్ఫ్‌ గోల్ వేసుకున్నట్టు చెబుతున్నారు.

బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటించలేదా ?

బీజేపీతో పొత్తు నేపథ్యంలో నర్సాపురం ఎంపీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. నాలుగేళ్లుగా బీజేపీలో తన హవా నడుస్తుందని భావించిన రఘురామ నర్సాపురం టికెట్ బీజేపీ తరుపున తనకే కేటాయిస్తారని భావించారు. అయితే ఇది పూర్తి స్థాయిలో నిజం కాదని బీజేపీ పార్టీ నర్సాపురం టికెట్ వస్తుందని రఘురామ నమ్మలేదని అందుకే బీజేపీ పార్టీలో చేరలేదని, ఆయనకు నమ్మకం ఉన్నా, బీజేపీ పార్టీ నుండి హామీ వచ్చినా ఈ పాటికే బీజేపీ పార్టీలో చేరి ఉండే వారని రఘురామ సన్నిహితులు చెబుతున్నారు.

నర్సాపురం ఎంపీ స్థానాన్ని రఘురామకు బీజేపీ ఎందుకు ఇవ్వలేదనేది అసలు ప్రశ్నగా మారింది. 2021 డిసెంబర్‌ 2022 జనవరి మధ్య అమిత్‌షాతో భేటీ తర్వాత తాను రాజీనామా చేస్తున్నట్లు రఘురామ ప్రకటించారు. రఘురామ బీజేపీలో చేరుతున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చిన అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు.

బీజేపీ వైపు ఆసక్తి చూపుతూనే రఘురామ చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగారు. చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారి ఆయనకు స్వాగతం పలికారు. తాను చంద్రబాబుకు బాగా దగ్గర అని ప్రచారం చేసుకున్నారు. ఈ క్రమంలో నర్సాపురం ఎంపీ టిక్కెట్‌ను వర్మకు కేటాయించడంపై సోము వీర్రాజు హస్తం ఉందని, సిఎం జగన్‌... వీర్రాజు ద్వారా విజయం సాధించారని ఆరోపించారు.

రఘు రామ చేసిన ఆరోపణలు పరోక్షంగా జగన్‌కు లబ్ది చేకూర్చేలా ఉన్నాయని, కూటమిని జగన్ ప్రభావితం చేస్తున్నారనే సందేశాన్ని రఘురామ ఇచ్చినట్టైందని బీజేపీలో మరో వర్గం అనుమానిస్తోంది. జగన్‌తో సోము వీర్రాజు కలిసి కుట్రలు చేశారనే ఆరోపణల ద్వారా బీజేపీకి.. జగన్‌ దగ్గరనే సందేశం ఇచ్చినట్టైందని ఇది కూటమిలో ఉన్న పార్టీలన్నింటిపై పడుతుందనే వాదన కూడా ఉంది.

రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుండి రావాలని కోరుకుంది. అందుకు పొత్తులు ఒక్కటే మార్గం. రాష్ట్రంలో అధికార వైసీపీ ఎదుర్కొని పోరాడాలన్నా, అధికారులు, ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నా బీజేపీతో పొత్తు లేకపోతే ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో టీడీపీ, బీజేపీతో పొత్తుకు సిద్ధమైంది.

బీజేపీ-వైసీపీ దోస్తీపై అనుమానాలు…

బీజేపీ రాష్ట్రంలో ఐదేళ్లుగా వైసీపీతో అంటకాగిందనే విమర్శలు కూడా ఉన్నాయి. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే అసలుకే మోసం వస్తుందని టీడీపీ భావించినా ఎన్నికల గోదాలో బీజేపీ నుండి సహాయ సహకారాలు లభిస్తాయనే ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తుకు టీడీపీ సై అంది.

పొత్తు కుదిరిన తర్వాత కూడా బీజేపీ-టీడీపీ కూటమిపై అపనమ్మకం కలిగేలా వెలువడే వార్తలకు అడ్డు కట్ట వేసే లక్ష్యంతోనే మొదటి కూటమి సభకి మోడీని ఆహ్వానించినట్టు చెబుతున్నారు.

నర్సాపురం టిక్కెట్‌ దక్కకపోయే సరికి రఘురామరాజు చేసిన వ్యాఖ్యలతో కూటమిలోని బీజేపీ పార్టీ మీద అపనమ్మకం కలిగించేలా ఉన్నాయని, ఆర్‌ఆర్‌ఆర్ వ్యాఖ్్యలు వైసీపీలో ఉత్సాహాన్ని నింపితే, ఎన్నికల సమయంలో బీజేపీ సహాయ సహకారాలు టీడీపీ కూటమికి ఉండవని సంకేతాలు పంపినట్లు అయ్యిందనే ఆందోళన నెలకొంది.

కూటమికి జరుగుతున్న డామేజ్‌ని టీడీపీ, జనసేన, ఎలా కంట్రోల్ చేయ గలుగుతాయో చూడాలి. బీజేపీ సంపూర్ణ మద్దతు కూటమికి ఉందని కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలకు నమ్మకం కలిగేలా చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం