Modi 3.0 Cabinet : మోదీ కేబినెట్ - కేంద్ర మంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డికి అవకాశం..!-bandi sanjay and kishan reddy likely to get place in union cabinet 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Modi 3.0 Cabinet : మోదీ కేబినెట్ - కేంద్ర మంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డికి అవకాశం..!

Modi 3.0 Cabinet : మోదీ కేబినెట్ - కేంద్ర మంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డికి అవకాశం..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 09, 2024 12:12 PM IST

Union Ministers From Telangana : కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు ఖరారైనట్లు సమాచారం. ఇందులో బండి సంజయ్, కిషన్ రెడ్డి పేర్లు ఉన్నాయి..!

కేంద్ర కేబినెట్ లోకి బండి సంజయ్, కిషన్ రెడ్డి...!
కేంద్ర కేబినెట్ లోకి బండి సంజయ్, కిషన్ రెడ్డి...!

Union Ministers From Telangana : తెలంగాణ నుంచి గెలిచిన ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కినట్లు సమాచారం. సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ కు పీఎంవో నుంచి సమాచారం అందింది. ఇవాళ సాయంత్రం మోదీతో పాటు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి మరోసారి గెలిచారు. గతంలోనూ ఇదే స్థానం విజయం సాధించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో కిషన్ రెడ్డి జన్మించారు. టూల్ డిజైనింగ్ లో డిప్లమా చేశారు.  1977లో జనతా పార్టీలో చేరారు. అంతుకుముందు సంఘ్ కార్యకర్తగా ఉన్నారు. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్ పదవి చేపట్టారు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవులను పొందారు.

హిమాయత్ నగర్ నుంచి గెలుపు…

బీజేపీలో కీలక నేతగా ఎదిగిన కిషన్ రెడ్డి తొలిసారిగా హైదరాబాద్ నగరంలో ఉన్న హిమాయత్ నగర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో అంబర్ పేట నుంచి బరిలో నిలిచారు.   2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2014లో మరోసారి అవకాశం దక్కింది. 2014 ఎన్నికల్లో అంబర్ పేట్ నియోజకవర్గ నుంచి పోటీ చేసి మరోసారి గెలిచారు. 2016 నుంచి 2018 వరకు అసెంబ్లీలో బిజేపీ శాసనసభ నేత పని చేశారు.

ఇక 2018 ఎన్నికల్లో అంబర్ పేట నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి ఓడిపోయారు. అయితే ఆ వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బరిలో ఉన్నారు. ఇందులో గెలవటమే కాకుండా ఏకంగా కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. మొన్నటి వరకు కూడా కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

రెండోసారి సంజయ్ విజయం…

ఇక బండి సంజయ్ విషయానికొస్తే… 2019 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. బీఆర్ఎస్ కంచుకోటగా భావించే ఈ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ పై విక్టరీ కొట్టారు. అంతకుముందుకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బండి సంజయ్ ఓడిపోయారు. 2019లో తొలిసారిగా ఎంపీగా గెలిచిన సంజయ్… 2024 ఎన్నికల్లోనూ మరోసారి ఇదే స్థానం నుంచి విజయం సాధించారు. అయితే 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి కమలాకర్ చేతిలో ఓడిపోయారు.

ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. 17 స్థానాల్లో పోటీ చేసి 8 స్థానాలను గెలుచుకుంది. గతంలో 4 స్థానాలు ఉండగా… ఈసారి మరో నాలుగు స్థానాల్లో పాగా వేసింది. ఫలితంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు ధీటుగా సీట్లను సాధించింది.

 

Whats_app_banner